ఎన్టీఆర్‌తో కలసి ఎన్నో సినిమాల్లో అద్భుత నటన
డిసెంబర్ 23 (ఆంధ్రపత్రిక): సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తన 60ఏళ్ళ సినీ కెరీర్‌లో 777 సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఆయన పోషించని పాత్ర లేదు. అందుకే నవరసనటనా సార్వభౌముడిగా పేరు సంపాదించారు. ఇకపోతే ఆయన ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్‌తో వెండితెరను పంచుకున్నారు. మొదటి సినిమా ’సిపాయి కూతురు’ తర్వాత కైకాలకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇక రెండవ సినిమా ’కనక దుర్గ పూజా మహిమ’ చేస్తున్నప్పుడే కైకాల.. సీనియర్ ఎన్‌టీఆర్ కంట పడ్డాడు. అచ్చం తనకు మల్లే దేహం ఉండటంతో ఎన్టీఆర్ తను నటిస్తున్న ’సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’లో కైకాలకు ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాలో కైకాల యువరాజు పాత్రలో నటించాడు. ఆయన నటనకు ముగ్దుడైన సీనియర్ ఎన్టీఆర్.. తను డూప్‌గా నటించిన ప్రతీ సినిమాలో కైకాలనే పెట్టుకున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి కైకాలా 101 చిత్రాల్లో నటించారు. ఓ నటుడు, ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కలిసి నటించిన అత్యధిక చిత్రాల రికార్డు దక్షిణాదిన వీరిదేనేమో. ఎన్టీఆర్ నటించలేని ఎన్నో సన్నివేశాలలో కైకాల నటించేవాడు. ఫైట్ సీన్‌లలో, పతాక సన్నివేశాల్లో నేరుగా సత్యనారాయణెళి ఎన్టీఆర్‌గా నటించిన సందర్భాలు ఉన్నాయి. తన కోసం ఇంత కష్టపడుతున్న సత్యనారాయణ.. నటుడిగానూ నిరూపించుకోవాలని ఎన్టీఆర్ తాపత్రయ పడేవారట. అలా ఎన్నో పౌరాణిక చిత్రాల్లో తన పాత్ర తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న పాత్రలను సత్యనారాయణకు ఎన్టీఆర్ ఇప్పించేవారట. ఇక యమగోల సినిమాతో తొలిసారి యముడి వేషం కట్టిన కైకాల సత్యనారాయణను చూసి యముడంటే ఇలానే ఉండాలని ఎన్టీఆర్ అన్నారట. ఈ సినమా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా కైకాల.. ఎన్టీఆర్‌కు తోడుగా నిలిచాడు. కైకాలను ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎన్ని సార్లు ఆహ్వానించిన.. ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత కొన్ని ఏళ్ళకు చంద్రబాబు ఆహ్వానం మేరకు.. కైకాల 1996లో మచిలీపట్నం ఎంపీగా గెలిచి లోక్ సభకు వెళ్లారు .
కైకాల మృతికి సినీ ప్రముఖుల సంతాపం
అజాత శతృవుగా అభివర్ణించిన దర్శకేంద్రుడు
గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈనేపథ్యంలో ఆయన పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, నటులు మాదాల రంగారావు, బెనర్జీ పుష్పాంజలి ఘటించారు. నటులు బాలకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్, నిర్మాత అల్లు అరవింద్ సంతాపం తెలిపారు. కైకాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆహార్యం, అభినయం, ఆంగికాల కలబోత.. కైకాల నటన అని సీనియర్ హీరో బాలకృష్ణ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి పలు చిత్రాల్లో ఆయన అభినయం ఎన్నటికీ మరువలేమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు. కైకాల మృతి సినీరంగానికి తీరని లోటని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్,
సత్యనారాయణ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉండేదని చెప్పారు. ల్గªకాల సత్యనారాణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు అన్నారు. ఆయన నటించిన పాత్రలు లేవన్నారు. భావోద్వేగ పాత్రల్లో నటిస్తే కన్నీళ్లు తెప్పించేవారని గుర్తుచేసుకున్నారు. ఏనాడూ వివాదాల జోలికి వెళ్లకుండా అందరితో స్నేహంగా ఉండేవారని చెప్పారు. ఆయన అజాత శత్రువని కొనియాడారు.
సత్యనారాయణ అకాల మరణవార్త తనను కలచివేసిందని హీరో రామ్‌చరణ్ అన్నారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని వెల్లడిరచారు. తెలుగు సినీ పరిశ్రమలో తాను అభిమానించే నటుల్లో ఒకరు కైకాల సత్యనారాయణ అని హీరో నాని అన్నారు. ఆయన మరణం తన హృదయాన్ని ముక్కలు చేసిందన్నారు. మన ఇంట్లో మనషిలా అందరితో కలిసిపోయేవారని చెప్పారు. సినిమాల్లో ఆయన నటన అద్భుతమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
పాత్రకు ప్రణం పోసిన సత్యనారాయణ….
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. ఈ పాట వినని సినీ అభిమాని ఉండరు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన నిప్పులాంటి మనిషి చిత్రంలోనిది ఈ సాంగ్. స్నేహితుల మధ్య ఉండే బంధాన్ని గొప్పగా చెప్పిన చిత్రం అది. అయితే ఆ ఫిల్మ్‌లో కైకాల సత్యనారాయణ కీలక పాత్ర పోషించాడు. ఎన్టీఆర్‌కు మిత్రుడిగా చేశాడు. ఇక స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం సాంగ్ ఆ సినిమాకే హైలైటె?. ఆ పాటలో కైకాల నటనా కౌశలం మరో అద్భుతం. స్నేహ గీతానికి సత్యనారాయణ తన డ్యాన్స్ శైలితో వన్నెతెచ్చారు. టాలీవుడ్‌లో ఆ నాటి రోజుల్లో ఇదో చార్ట్‌బస్టర్. అమితాబ్ నటించిన హిందీ సూపర్‌హిట్ ఫిల్మ్ జంజీర్ ఆధారంగా నిప్పులాంటి మనిషి సినిమాను తీశారు. నిజానికి అమితాబ్ నటించిన చాలా చిత్రాలను సీనియర్ ఎన్టీఆర్ రీమేక్ చేశారు. కానీ ఈ ఫిల్మ్‌లో ఉన్న స్నేహమేరా జీవితం సాంగ్ ఎవర్‌గ్రీన్. ఎంతో ఉత్సాహాన్ని నింపే ఈ సాంగ్‌లో సత్యనారాయణ తన యాక్టింగ్‌తో విమర్శలను కూడా ఆకట్టుకున్నారు. సీనారే అందించిన అద్భుత సాహిత్యాన్ని.. తన హావభావాలతో కైకాల స్క్రీన్ ముందు ప్రదర్శించిన తీరు అనిర్వచనీయం. పఠాన్ గెటప్‌లో సత్యనారాయణ .. ఓరిజనల్ సాంగ్‌కు తీసిపోని రీతిలో నటించారు. జంజీర్‌లో ఈ పాత్రను మెగా విలన్ ప్రాణ్ పోషించాడు. ప్రాణ్‌కు ధీటైన రీతిలో.. నిజానికి అంతకన్నా మెరుగై రీతిలో కైకాల నటించారు. ఆ ఖవాలీ సాంగ్ వీడియోను విూరూ ఎంజాయ్ చేయండి..
తమ్ముడూ అంటూ సంబోధించే వారు
కైకాల మృతిపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
నవరస నటసార్వ భౌముడు కైకాల సత్యనారాయణ మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ విూడియా వేదికగా కైకాల సత్యనారాయణ మరణం పై ఎమోషనల్ అయ్యాడు. కైకాలతో చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. కైకాలతో తాను పంచుకున్న మధుర క్షణాల గురించి గతంలో చిరంజీవి సోషల్ విూడియా ద్వారా వెల్లడిరచారు. కైకాల ప్రతీ పుట్టినరోజు నాడు చిరంజీవి, సురేఖ దంపతులు ఆయన ఇంటికెళ్లి కేక్ కట్ చేయిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆయన లేరనే వార్త చిరంజీవి తట్టుకోలేకపోతున్నాడు. కైకాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ భావోద్వేగ పూరితమైన లేఖను సోషల్ విూడియాలో పోస్ట్ చేశాడు. ‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు మృతి చెందడం నన్ను కలచివేస్తోంది. శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. శ్రీ సత్యన్నారాయణ గారు పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో వేరొక నటుడు పోషించి ఉండరు. శ్రీ కైకాల సత్యన్నారాయణ గారితో కలిసి నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు కలిగింది. గొప్ప స్పాంటేనియిటీ ఉన్న అరుదైన నటులు ఆయన. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్చమైన స్ఫటికం లాంటి మనిషి నిష్కల్మషమైన మనసున్న మనిషి. ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు. నన్ను ‘తమ్ముడూ‘ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆనందకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నటన, రుచికరమైన భోజనం రెండూ శ్రీ కైకాల సత్యన్నారాయణ గారికి ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతివంటను ఎంతో ఇష్టపడేవారు. క్రిందటేడాది, ఈ యేడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిగిలిన సంతృప్తి. ఆ సందర్భంగా సత్యన్నారాయణ గారు సురేఖతో ‘అమ్మా ఉప్పు చేప వండి పంపించు‘ అని అన్నప్పుడు ‘విూరు త్వరగా కోలుకోండి.. ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం‘ అని అన్నాము. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోష పడిపోయారు. శ్రీ కైకాల సత్యన్నారాయణ గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను‘ అంటూ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వేశాడు.