భగవంతుణ్ని సేవించే భక్తులను నాలుగు తెగలుగా చెబుతారు` ఆర్తి, అర్దార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ నలుగురిలో ఆయనకు చాలా దగ్గరివాడు జ్ఞాని అని గీతాచార్యుడు సెలవిచ్చాడు.భగవంతుడు అన్నీ ఇచ్చాడు. అయినా, ఏదో తెలియని ఆరాటం గుండెల్లో ఆరడి చేస్తూనే ఉన్నది. కారణం ఏదో ఒకమూల స్వార్థపిశాచం పీడిరచడం వల్లే అలా మనసు అల్లాడుతూ ఉంటుంది. మనం చేయవలసినదేదో శక్తివంచన లేకుండా, సక్రమంగా చేస్తే చాలు… తక్కినదంతా ఆయనే చూసుకుంటాడు. ఆ మాట కూడా గీతాచార్యుడు చాలా స్పష్టంగానే చెప్పాడు. అయినా అజ్ఞానం, అహంకారం, మమకారం… ఈ మూడూ ఏకమై మనల్ని పెడదారికి ఈడుస్తూ ఉంటాయి.అలా జరగకుండా మనసును నిర్మలంగా ఉంచమని, ప్రపంచాన్ని ప్రేమగా చూడగల హృదయ సౌందర్యాన్ని ప్రసాదించమని, పరోపకారం వైపు బుద్ధిని మరల్చమని, మాటలకందని మౌనభాషలో భగవంతుణ్ని వేడుకోవడమే నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థన సన్నని వెలుగై మన జీవితాలను గమ్యంవైపు నడిపిస్తుంది. ’సర్వేజనాః సుఖినో భవంతు’ అనే ఒక గొప్ప ప్రార్థనను వేదం ప్రపంచానికి అందించింది. అదే మన జీవితాలకో దారిదీపమై వెలుగు చూపాలని అర్థించాలి. అదే మనం చేయవలసిన ప్రార్థన!