బాలయ్య, చిరుల సినిమాల జోష్
12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య
జనవరి 10 (ఆంధ్రపత్రిక): ఈ సంక్రాంతికి వెండితెర సందడి అప్పుడే మొదలై పోయింది! గత మూడేళ్ల నుంచి కరోనా నిబంధనల కారణంగా సంక్రాంతికి పెద్ద సినిమాలు అంతగా రాలేదు. దాంతో చిన్న చిత్రాల మధ్య పండగలు గడిచి పోయాయి. ఈ ఏడాది చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు సిద్ధం కావడంతో వారి అభిమానుల్లో ఆనందం ఉరకలేస్తోంది. సంక్రాంతికి ప్రతి ఏటా పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయడం ఆనవాయితీగా వస్తోంది. చిరంజీవి ’వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ’వీర సింహారెడ్డి’ ఈసారి సందడి చేయనున్నాయి. ఈ రెండిరటి నిర్మాణ సంస్థా మైత్రీ మూవీసే కావడం గమనార్హం. ఈ రెండు సినిమాల ప్రచారం ఉవ్వెత్తున సాగుతోంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ల నుంచి పాటలు, టీజర్ల వరకూ ప్రతి ఒక్కటీ నువ్వా నేనా అనే విధంగా సాగుతున్నాయి. 40 ఏళ్ళలో ఈ హీరోల సినిమాలు దాదాపు 17సార్లు పోటీ పడ్డాయి. కొన్నిసార్లు బాలయ్య పైచేయి సాధిస్తే.. కొన్నిసార్లు చిరంజీవి పైచేయి సాధించారు. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత వీరి సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సినిమా ప్రమోషన్లూ పోటాపోటీగా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. దర్శకుడు గోపిచంద్ తీసిన బాలయ్య సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుండగా.. చిరంజీవి సినిమా 13న విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించడం గమనార్హం. దర్శకుడు బాబి తీస్తున్న ’వాల్తేరు వీరయ్య’లో మాస్ హీరో రవితేజ కీలకపాత్ర పోషించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. తమిళ అగ్రహీరో లైన విజయ్, అజిత్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వీరి సినిమాలూ గతంలో సంక్రాంతి బరిలో 9 సార్లు పోటీపడ్డాయి. 8 ఏళ్ల తర్వాత మళ్లీ పోటీ పడటంతో వారి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. విజయ్ ’వారిసు’, అజిత్ ’తునివు’ సినిమాలు జనవరి 11న రాబోతున్నాయి. ఇవి తెలుగులోనూ ’ వారసుడు’, ’ తెగింపు’ టైటిళ్లతో వస్తున్నాయి. ఇందులో వారసుడు రిలీజ్ డేట్‌ను నిర్మాత దిల్‌రాజు 14కు మార్చారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన విజయ్ ’వారసుడు’ను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తు న్నారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటించారు. పూర్తి యాక్షన్‌గా తెరకెక్కిస్తూ హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ సినిమా ’తెగింపు’ వస్తుంది. ఇందులో మంజు వారియర్ హీరోయిన్‌గా నటించారు. దాంతో నగరాలు, పట్టణాల్లో పెద్ద థియేటర్లు ఈ నలుగురు హీరోల సినిమాలు సందడి చేస్తున్నాయి. హీరో సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన ’కల్యాణం కమనీయం’ 14న విడుదల కానుంది. సినిమా రిలీజ్ అవుతోంది. దోస్తాన్, ప్రత్యర్థి, ఎ జర్నీ టు కాశీ, మైఖేల్ గ్యాంగ్ లాంటి చిన్న సినిమాలు కొన్ని థియేటర్లలోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ పెద్ద సినిమాలు బిజినెస్ పరంగా రికార్డులు నెలకొల్పుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు విడుదల చేయడం పెద్ద సాహసమే. మొత్తంగా ఈ సంక్రాంతికి తమ అభిమాన హీరోల సినిమాలు విడుదల కావడంతో థియేటర్లు కలర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయి.