హైదరాబాద్ విమానాశ్రయంలో సాఫ్రాన్ ఎంఆర్ఓ కేంద్రం
హైదరాబాద్ విమానాశ్రయం ప్రాంగణంలో ఫ్రాన్స్ కంపెనీ సాఫ్రాన్ విమానాల మరమ్మతు కేంద్రాన్ని (ఎంఆర్ఓ) ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు జీఎంఆర్ హైదరాబాద్…
* రూ.1,200 కోట్ల పెట్టుబడులు!
-
2025లో కార్యకలాపాలు షురూ
-
1,000 మంది నిపుణులకు ఉపాధి
-
మొదటి దశలో ఏడాదికి 100 లీప్ ఇంజన్ల మరమ్మతు
హైదరాబాద్ ( ANDHRAPATRIKA ): హైదరాబాద్ విమానాశ్రయం ప్రాంగణంలో ఫ్రాన్స్ కంపెనీ సాఫ్రాన్ విమానాల మరమ్మతు కేంద్రాన్ని (ఎంఆర్ఓ) ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) అనుబంధ కంపెనీ జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ (జీహెచ్ఏఎ్సఎల్), సాఫ్రాన్ అనుబంధ కంపెనీ సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ సర్వీసెస్ ఇండియా (ఎస్ఏఈఎ్సఐపీఎల్) ల్యాండ్ లీజింగ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్ ఏవియేషన్ ఎస్ఈజెడ్ ఇచ్చే భూమిలో సాఫ్రాన్ లీప్ టర్బోఫ్యాన్ ఇంజన్ల మరమ్మతుకు ఎంఆర్ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్‌లోని ఎస్ఈజెడ్ ప్రాంతంలో 23.5 ఎకరాల స్థలాన్ని సాఫ్రాన్ తీసుకుంటుంది. 36,500 చదరపు మీటర్ల బిల్టప్ ఏరియాలో ఎంఆర్ఓ కేంద్రాన్ని నిర్మిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబరులో నిర్మాణం ప్రారంభమై.. 2024 డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ నెట్‌వర్క్‌లోని ఎంఆర్ఓలలో ఇదే అతిపెద్ద ఎంఆర్ఓ అవుతుంది. 2025లో ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించే వీలుంది. పూర్తి స్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే దాదా పు 1,000 మంది నిపుణులకు ఉపాధి లభిస్తుందని జీఎంఆర్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ డెవల్‌పమెంట్ సీఈఓ అమన్ కపూర్ తెలిపారు. మొదటి దశలో ఏడాదికి 100 ఇంజన్లను మరమ్మతు చేసే సామర్థ్యంతో ఎంఆర్ఓను ఏర్పాటు చేస్తారు. 2035 నాటికి ఈ సామర్థ్యం 300 ఇంజన్లకు చేరుతుంది. ఎంఆర్ఓ కేంద్రంపై దాదాపు 15 కోట్ల డాలర్ల పెట్టుబడులు (దాదాపు రూ.1,200 కోట్లు) పెట్టే వీలుంది. ఏడాది క్రితం భారత్‌లో ఎంఆర్ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సాఫ్రాన్ ప్రకటించింది. ఇప్పటికే జీఎంఆర్ విమానాశ్రయం ప్రాంగణంలో ఎయిర్ ఇండియా ఎంఆర్ఓ కేంద్రం ఉంది. జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఎంఆర్ఓ సేవలను అందిస్తోంది.
ఇప్పటికే సాఫ్రాన్‌కు ఇక్కడ యూనిట్లు..
జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్‌లోని ఎస్ఈజెడ్ ప్రాంతంలో ఇప్పటికే సాఫ్రాన్‌కు విమాన ఇంజన్ల విడి భాగాలను తయారు చేసే యూనిట్ ఉంది. దీంతోపాటు కేబుల్ హార్నెసింగ్ యూనిట్‌ను కూడా నిర్వహిస్తోంది. జీఈతో కలిసి సాఫ్రాన్ ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థ సీఎ్‌ఫఎం ఇంజన్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ సదుపాయాన్ని నిర్వహిస్తోంది.