నేటినుంచి అయ్యప్ప దర్శనానికి అనుమతి
తిరువనంతపురం,నవంబర్ 16 (ఆంధ్రపత్రిక): శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు బుధవారం నవంబర్ 16 నుండి తెరుచుకున్నాయి. గురువారం నుండి రెండు నెలల పాటు స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు . వార్షిక మండలం`మకరవిళక్కు యాత్ర కూడా నేటి నుంచే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు (తంత్రి) కందరారు రాజీవ, మాజీ ప్రధాన అర్చకులు ఎన్. పరమేశ్వరన్ నంబూద్రి సమక్షంలో ఆలయ గర్భగుడి తలుపులు తెరిచారు. అనంతరం అయ్యప్ప, మలికాపురం ఆలయాల ప్రధాన అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 41 రోజుల పాటు జరిగే మండల పూజ కార్యక్రమాలు డిసెంబర్ 27న ముగియ నున్నాయి. తర్వాత మూడు రోజుల పాటు ఆలయంలో ప్రజల దర్శనానికి అనుమతి ఉండదు. డిసెంబర్ 30వ తేదీ నుంచి మకరవిళక్కు యాత్ర కోసం ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా మకరవిళక్కు(మకర జ్యోతి) దర్శనం ఉంటుంది. ఇతర పూజా కార్యక్రమాల అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. ఈ ఏడాది శబరిమల యాత్ర సీజన్ అక్కడితో ముగుస్తుంది. కోవిడ్`19 ఆంక్షల కారణంగా గత రెండేళ్లుగా భక్తులు శబరమలకు చేరుకోలేకపోయారు. ఈసారి ఆంక్షలు సడలించడంతో లక్షలాది మంది భక్తులు శబరిమల యాత్రకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శబరిమల మార్గంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రత కోసం సుమారు 13,000 మంది సిబ్బందిని మోహరించారు. అయితే, ఈ సంవత్సరం యాత్రికులు వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. అలాగే, ఒక్కరోజులో గరిష్టంగా 1.2 లక్షల మంది భక్తులకు దరశ్శించుకునే వెసులుబాటు ఉందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.