GT VS KKR: ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో ఏరకంగా చెలరేగిపోయాడు యావత్ క్రీడా జగత్తు వీక్షించి ఉంటుంది.కేకేఆర్ గెలుపుకు చివరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సిన తరుణంలో రింకూ సింగ్ ఎవరూ ఊహించని విధంగా ఆఖరి 5 బంతులను సిక్సర్లుగా మలచి, మ్యాచ్‌ను గెలిపించడంతో పాటు రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు.రింకూ విధ్వంసం చూసి అతన్ని ప్రశంసించని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి లాస్ట్ ఓవర్ చూడలేదని అభిమానులతో పాటు దిగ్గజ క్రికెటర్లు కొనియాడుతున్నారు. ప్రత్యర్ధి జట్ల ఆటగాళ్లు సైతం రింకూ ఊచకోత చూసి ముగ్దులైపోయారు. కేకేఆర్ సహ యజమాని జూహీ చావ్లా అయితే మ్యాచ్ అనంతరం ఉద్వేగం తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంది. రింకూ బ్యాటింగ్‌ను చూసి ఇది కలనా నిజమా అన్న డైలమాలో ఉండిపోయింది. ప్రస్తుతం యావత్ సోషల్‌మీడియా రింకూ నామస్మరణతో మార్మోగిపోతుంది. అంతలా రింకూ ఒక్క ఇన్నింగ్స్‌తో క్రికెట్ ఫెటర్నిటిని మొత్తాన్ని ప్రభావితం చేశాడు.
ఇంత చేసి, ఒక్క రాత్రిలో జీవితానికి సరిపడా స్టార్ డమ్ సంపాదించిన రింకూ సింగ్‌లో ఏమాత్రం గర్వం కనపడకపోవడం క్రికెట్ ప్రపంచాన్ని మరింతగా ఆకర్శిస్తుంది. చారిత్రక ఇన్నింగ్స్ అనంతరం రింకూ బిహేవియర్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. రింకూ సింప్లిసిటి, అమాయకత్వం ఫ్యాన్స్‌ను ఈ యువ ఆటగాడికి మరింత దగ్గరకు చేసింది. మ్యాచ్ అనంతరం రింకూ చేసిన ఓ పని, అప్పటివరకు ఎవరైనా అతన్ని మెచ్చుకోని వారుంటే వారిని కూడా ఫ్యాన్స్ జాబితాలో చేరిపోయేలా చేసింది.
ఇంతకు రింకూ ఏం చేశాడంటే.. తన చేతిలో బలైపోయిన యశ్ దయాల్‌ను మ్యాచ్ అనంతరం ఓదార్చే ప్రయత్నం చేశాడు. తన వల్లే జట్టు ఓడిందన్న బాధతో ముఖం చూపించుకోలేకపోయిన యశ్‌కు మద్దతుగా నిలిచి తన గొప్ప మనసు చాటుకున్నాడు. మనసును హత్తుకునే మెసేజ్‌తో యశ్‌లో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు.
యశ్‌ను మోటివేట్ చేసేందుకు తనవంతు ప్రయత్నాలన్నీ చేశాడు. టార్గెట్‌ను డిఫెండ్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశావు.. నువ్వు చాలా బాగా బౌలింగ్ చేశావు.. నిరాశ చెందకు.. క్రికెట్లో ఇది సర్వసాధారణం అంటూ మెసేజ్ చేశాడు. రింకూ యశ్‌కు మెసేజ్ చేసిన విషయాన్ని ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ వెల్లడించింది.