తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలోనూ ఆసక్తి రేపాయి. ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమయినప్పటి నుండి తెలంగాణ ఎన్నికల గురించి ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. పక్కనే ఉన్న రాష్ట్రం కావడంతో ఇక్కడి గెలుపు ఏపిలో ప్రభావం చూపించింది. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు. అదే విధంగా ఏ పార్టీ గెలుస్తుందన్న అంశంపై బెట్టింగ్స్ కూడా జోరుగా నడిచాయి.
అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడవ్వగానే కాంగ్రెస్ విజయం సాధించడంతో ఎవరూ ముఖ్యమంత్రి అన్న అంశంపై జోరుగా చర్చించుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అవుతారా లేదా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. ఏపిలోని ప్రతి ఒక్కరి నోళ్లలో ఈ అంశం ఇప్పటికీ నానుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల్లో గెలుపొందిన రేవంత్ కు తాడేపల్లిలోని జాతీయ రహదారిపై భారీ ప్లెక్స్ ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతమైన తాడేపల్లిలో రేవంత్ ప్లెక్స్ ను స్థానికులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. గుంటూరు, విజయవాడ మధ్య తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం వద్ద ఇలాంటి ఫ్లెక్స్ ఏర్పాటు చేయడంతో మరింత చర్చనీయాంశమైంది.
అత్యంత్య కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రాంతంలో రేవంత్ కు భారీ ప్లెక్స్ ఏర్పాటు చేయడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రాహూల్ చౌదరి అనే పేరుతో ఏర్పాటైన ప్లెక్స్ లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు పేర్కొనడం విశేషం. మొత్తం మీద ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి సీఎంగా ప్రమాణం స్వీకారం జరిగే వరకూ ఏపి ప్రజల్లోనే కాకుండా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడం ఆసక్తికరంగా మారింది.