కలెక్టరేట్లో స్పందన అర్జీలను పరిశీలిస్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, పక్కన జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు తదితరులు.
స్పందన అర్జీలను వేగవంతంగా పరిష్కరించండి.. !
కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు..!
మచిలీపట్నం ఆగస్టు 14 ఆంధ్రపత్రిక..!
స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ కిషోర్, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శివ నారాయణ రెడ్డి లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి పలు ప్రాంతాల ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించారు. సంబంధిత అధికారులను పిలిపించి అర్జీల పరిష్కారంపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా అధికార యంత్రాంగం స్వీకరించిన అర్జీలలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి రంగారావు మాట్లాడుతూ జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో నీట మునిగి దెబ్బతిన్న వరి పొలాలకు ప్రభుత్వం 80% సబ్సిడీతో వరి విత్తనాలు ఇస్తుందని ఈ సార్వా సీజన్లో ఎక్కువ శాతం మంది రైతులు, కౌలు రైతులు రెండుసార్లుగా నాట్లు వేసుకోవడంలో రూపంలో జరిగిందని, మరలా భారీ వర్షాలకు ముంపుకు గురై దెబ్బతిన్నవని, దాదాపు ఎకరాకు 10 వేల నుంచి 12 వేల వరకు ఖర్చు అయినదని ప్రభుత్వం చేసి విత్తనాలతో పాటు ఆ ఖర్చులను కూడా ఇప్పించాలని 2022 సంవత్సరం సార్వ పంట తాలూకు రవాణా ఖర్చులు ఇవ్వలేదని ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని, 2020 సంవత్సరం ఏప్రిల్ నెల లో కురిసిన భారీ వర్షాలకు బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో దాదాపు 4524 మంది రైతులకు సుమారు 3 కోట్ల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారని, ఇప్పటివరకు రైతులకు ఇవ్వలేదని, ఆ మొత్తం సి ఎఫ్ ఎం ఎస్ లో ఉందని గత రెండు సంవత్సరాల నుండి అధికారులు చెబుతున్నారని ఇప్పటికైనా ఆ సమస్యలపై స్పందించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు.
కృత్తివెన్ను మండలం నిడమర్రు పంచాయతీ ఒర్లగొంది తిప్ప గ్రామానికి చెందిన జల్లా లక్ష్మి మాట్లాడుతూ తన భర్త వెంకటేశ్వర్లు, ఇద్దరు కుమారులు వలకట్లకై బతుకుదెరువు కోసం వెళ్లి ఏప్రిల్ 8, 2020 లో భర్త, ఒక కుమారుడు చనిపోయారని ఇంకొక కుమారుడు యేసు రాజు ఎలాగో బతికి తిరిగి వచ్చాడని, వృత్తిపరమైన పనులు కొనసాగే పరిస్థితిలో లేమని, కుటుంబ పోషణ కోసం తన కుమారునికి ఏదైనా ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటూ వినతిపత్రాన్ని అందజేశారు. ఇదే విషయం మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య(నాని) జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చి ఆమె కుమారునికి ఏదో ఒక ఉపాధి అవకాశం కల్పించాలని కోరారు.
తొట్లవల్లూరు మండలం కొమ్ముమూరు గ్రామానికి చెందిన టి. భవాని టి. రామలక్ష్మీ, జే. వెంకటేశ్వరమ్మ తదితరులు మాట్లాడుతూ తాము యానాది కులానికి చెందిన వారమని, గ్రామంలో 35 సంవత్సరాలుగా నివసిస్తున్నామని, 9 మంది డ్వాక్రా గ్రూపుల్లో ఉంటున్నామని, రుణం తీసుకుని కడుతున్నామని, బ్యాంకు వారు కేవలం 30 వేల రూపాయలు ఇచ్చారని, ప్రభుత్వం చెప్పినట్లుగా తమకు రెండు లక్షల రూపాయల రుణం ఇస్తే వ్యాపారంతో పాటు ఇల్లు కట్టుకుంటామని అర్జీ అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రాంతాల నుండి ఎంతో శ్రమకోర్చి వ్యయ ప్రయాసలతో జిల్లా కేంద్రానికి వస్తున్నారని స్పందన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సానుకూలంగా పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో , డి ఆర్ డి ఎ డ్వామా పిడిలు పిఎస్ఆర్ ప్రసాద్, జి.వి. సూర్యనారాయణ, డిపిఓ నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, ముడా వీసి రాజ్యలక్ష్మి, డిఎం హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి, డీఈవో తాహేరా సుల్తానా, డి ఎస్ ఓ పార్వతి, డి సి హెచ్ ఎస్ ఇందిరా దేవి, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ. జగన్నాథరాజు, సర్వే భూ రికార్డుల ఏడి రంగారావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.