మచిలీపట్నం నవంబర్ 20 ఆంధ్ర పత్రిక.
ప్రజల నుండి అందే అర్జీల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ పెద్ది రోజా, మచిలీపట్నం ఆర్డిఓ ఎం వాణిలతో కలిసి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా విని సంబంధిత అధికారులను పిలిపించి అర్జీల పరిష్కారంపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా అధికార యంత్రాంగం స్వీకరించిన అర్జీలలో కొన్నింటి వివరాలిలా ఉన్నాయి.
మండల కేంద్రమైన పామర్రు గ్రామానికి చెందిన కొత్తపేట వాస్తవ్యులు మావులూరి సుభాకర్ రెడ్డి తన గ్రామంలో ఇటీవల మూడు రహదారులు నిర్మించారని అవి నాసిరకంగా ఉన్నాయని ఈ విషయమై తగిన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తూ అర్జీ అందజేశారు.
గూడూరు మండలం ముక్కోలు గ్రామానికి చెందిన సమ్మెట సాయి అరవిందు తనకు ఆర్ఎస్ నెంబర్ 240/4లో 50 సెంట్లు సాగు భూమి కలదని తన పొలానికి ట్రాక్టర్ వెళ్లకుండా అడ్డుగా కొందరు రేకుల షెడ్డు నిర్మిస్తున్నారని అదేమని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి వస్తున్నారని, ఈ విషయమై విఆర్ఓ చెప్పిన ఆయన మాట కూడా వారు వినడం లేదని పొలానికి వెళ్లే దారి మూయకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేశారు.
గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామానికి చెందిన కటికల జనార్ధన్ మాట్లాడుతూ తమ గ్రామంలో 6 వేల జనాభా ఉన్నారని, మేజర్ పంచాయతీ అని ఇంటి పన్ను, ఇతర పనులు వసూలు చేయుటకు బిల్లు కలెక్టర్ గాని, గుమస్తా లేరని వారి నియామకం చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు.
మచిలీపట్నం శారదానగర్ కు చెందిన పెద్ది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనకు 45 సంవత్సరాల వయసు అని, పుట్టుకతోనే రెండు కాళ్లు లేని దివ్యాంగులని, జీవనం చాలా కష్టతరంగా ఉందని ఇతరుల సహాయం లేనిదే ఏ పని చేయలేకపోతున్నానని, తన దీన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తనకు బ్యాటరీ బండిని ఇప్పించాలని మనవి చేస్తూ అర్జీ అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రాంతాల నుండి ఎంతో శ్రమకోర్చి వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రానికి వస్తున్నారని స్పందన అర్జీలను సానుకూలంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ, డ్వామా పిడిలు పి ఎస్ ఆర్ ప్రసాద్, జీవీ సూర్యనారాయణ, డిపిఓ నాగేశ్వర్ నాయక్,ముడా విసి రాజ్యలక్ష్మి, డీఈవో తాహెరా సుల్తానా, దేవాదాయ శాఖ ఏసీ శాంతి డాక్టర్ గీతా బాయి పౌరసరఫరాల సంస్థ డి ఎం శ్రీధర్, పంచాయతీరాజ్ ఎస్ఈ విజయ్ కుమారి, ఐసిడిఎస్ పిడి సువర్ణ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.