జ్ఞాపకం ఒక శక్తి,దానిని నిలబెట్టుకోవడం,పెంచుకోవడం,
పంచుకోవడం ఒక కళ!
అది ఒక వరం.
దీనికి పూర్తి వ్యతిరేకమైనది మతిమరుపు.అదొక పెద్ద శాపం! వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గడం,మతిమరుపు పెరగడం సహజమైన జీవచర్యగా భావించినా,దానిని అలా వదలు కూడదు.వృద్ధాప్యం వల్ల శారీరకమైన రుగ్మతలు వచ్చినా జ్ఞాపకశక్తిని అద్భుతంగా కాపాడుకున్నవారు మన మధ్యనే ఎందరో ఉండేవారు,ఇప్పటికీ ఉన్నారు.వారే మనకు ఆదర్శం.సివిల్ సర్వీసెస్ లో అఖిల భారత స్థాయి పోటీల్లో గెలిచి అద్భుతమైన ర్యాంకులు తెచ్చుకొని ఐఏఎస్ అధికారులుగా పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వహించి,అల్జీమర్స్ బారినపడి బాధపడుతున్నవారు కూడా మన మధ్యనే ఉన్నారు. వీరి జీవితాలు,వారితో పెనవేసుకొన్న వారి కుటుంబ సభ్యులు వేదనామయమైన జీవితాన్ని గడుపుతున్నారు.మరుపురాకుండా చూసుకోవడం,జ్ఞాపకశక్తిని పెంచుకోవడం మన చేతుల్లోనే ఎక్కువశాతం ఉందని వైద్య శాస్త్రవేత్తలు, మానసికవైద్య శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు.మన ఆరోగ్య పరిరక్షణలో ఏమాత్రంమరువకూడని అంశం ‘జ్ఞాపకశక్తి’.నిన్నటి వరకూ మన మధ్యనే ఉన్న‘కళాతపస్వి’ కె విశ్వనాథ్,‘అపరగంధర్వుడు’ మంగళంపల్లి బాలమురళీకృష్ణ,పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు అమోఘమైన జ్ఞాపకశక్తిని చివరివరకూ నిలుపుకున్నారు. వీరిలో మంగళంపల్లివారిది ఇంకా విశేషమైన ఆరోగ్యం.వీరికి అనారోగ్యాలు సోకిన దాఖలాలు కూడా పెద్దగా లేవు. వీరి గురించే ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే? వారు మన తెలుగువారు. ఎనిమిదిపదుల వయస్సు మించి జీవించినవారు.నేటి కుర్తాళ పీఠాధిపతి సిద్ధేశ్వరానందభారతి (పూర్వాశ్రమ డాక్టర్ ప్రసాదరాయకులపతి)కి ఇప్పుడు 86ఏళ్ళ వయస్సు.ఇప్పటికీ కొన్ని వేల పద్యాలు,శ్లోకాలు, స్త్రోత్రాలురసనాగ్రంపై నాట్యం చేస్తూ ఉంటాయి. ఆయన పుస్తకాలు చదవడం మానేసి కూడా 60ఏళ్ళు దాటిపోయింది.వీరే కాదు రామ్ జెత్మలానీ,శ్రీపాద పినాకపాణి వంటివారు కూడా అటువంటివారే. వీరు దాదాపు 100ఏళ్ళు అద్భుతమైన జ్ఞాపకశక్తితో జీవించారు.సుమారు65 ఏళ్ళ వయస్సు నుంచి మతిమరుపు పెరిగే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్కొక్క నివేదిక ఒక్కొక్క రకంగా చెబుతున్నప్పటికీ మతిమరుపు విషయంలో,జ్ఞాపకశక్తిని పెంచుకోవడం అంశంలో అయుదుపదుల వయస్సు నుంచే సాధన చేయడం ఉత్తమం. అధికరక్తపోటు,మధుమేహం, కొలెస్ట్రాల్ వంటివాటి వల్ల రక్తనాళాలు దెబ్బతినడం,మెదడుకు రక్తం సరిగ్గా సరఫరా కాకపోవడం, ప్రాణవాయువు సక్రమంగా అందకపోవడం వల్ల మతిమరుపు బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు చేస్తున్న హెచ్చరికలను గౌరవించి, వారు సూచించినట్లుగా పాటించాలి.శారీరకమైన రుగ్మతలకు మందులు వేసుకుంటూ, వ్యాయామం చేస్తూ,నడక సాగిస్తూ ఉండడం ముఖ్యం.అట్లే యోగ సాధన,ప్రాణాయామం,ఓంకారం, ధ్యానం వంటివాటిని కూడా కలిపి సాగాలి. అదే సమయంలో అతిగా ఆందోళన పడడం,క్రుంగుబాటు వంటివి ఇంకా ప్రమాదం. పొగతాగడం,మధ్యపానం వంటివాటికి దూరమవ్వడం ఎంత ముఖ్యమో వంటరితనానికి దూరమవ్వడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. మనిషిని ‘సోషల్ యానిమల్ ‘ అంటారు. జనంతో, జనం మధ్య ఉండడం,స్నేహితులు, ఆత్మీయులు, బంధువులను తరచూ కలవడం, వారితో గడపడం గొప్ప ఆరోగ్యాన్ని కలుగజేస్తుందని నిపుణులు చెప్పేమాటలు ఎంతో విలువైన మూటలు. తమను తాము ఎప్పుడూ బిజీగా ఉంచుకోవడం, మెదడును పదునుపెట్టే వాటిలో సమయం గడపడం చాలా చాలా ముఖ్యం. ఇది అన్ని వయసులవారికీ వస్తుంది. ముఖ్యంగా 60దాటినవారికి మరీ ముఖ్యం.మెదడును బాగా సద్వినియోగం చేయడం ఎంత ముఖ్యమో, మెదడుకు తగిన విశ్రాంతి ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. వైద్యుల సలహాల మేరకు ఆహారాన్ని తీసుకోవడం,నిద్రలోనూ సమయపాలన పాటించడం కీలకం. వేదకాలంనాటి భారతీయ విద్యా విధానం చాలా గొప్పది.జ్ఞాపకశక్తిని చాలా చురుకుగా ఉంచేలా ఉండేది.గురువులు చెప్పింది వినడం,మెదడులో ధరించడం,వల్లెవేయడం,తిరిగి అప్పచెప్పడం.. ఇలా అంతా మౌఖికంగా సాగేది.తెలుగువారి’అవధాన విద్య’ కూడా ఈ సూత్రాలపైనే నిర్మాణమైంది.పద్యాలను ధారణ చేయడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. పలకడం ద్వారా జరిగే చర్య ద్వారా రక్తప్రసరణ,ఆక్సిజెన్ ప్రవాహం బాగా జరుగుతాయి. ఈ సాధన విద్యార్థుల నుంచి వృద్ధుల వరకూ ఉపయోగపడుతుంది.ఆటలు, పాటలు కూడా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీర్చిదిద్దేవే. మన విద్యావిధానంలో నిన్నమొన్నటి వరకూ ఉన్నాయి. కొన్నాళ్ళుగా అవి సన్నగిల్లాయి. ఇప్పుడిప్పుడే నూత్న విద్యా విధానం వాటిపై దృష్టి సారిస్తోంది. మొత్తంగా చూస్తే మతిమరుపు రాకుండా చూసుకోవడం,జ్ఞాపకశక్తిని పెంచుకోవడం చాలా వరకూ మన చేతుల్లోనే ఉంది