ఏపీలో గత వైసీపీ పాలనలో ఆంధ్రా యూనివర్శిటీ వీసీగా పనిచేసిన ప్రసాదరెడ్డి విద్యార్ధుల నుంచి ఎదురవుతున్న నిరసనలను ఎదుర్కొనేందుకు తన ఛాంబర్ కు ప్రత్యేకంగా గేట్లు వేయించారు.
తద్వారా నేరుగా విద్యార్ధులు, ఆందోళనకారులు తన ఛాంబర్ వద్దకు రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏయూనూ ప్రక్షాళన చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా కొత్త వీసీ రావడంతో పాటు ఛాంబర్ గేట్ల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
గత ప్రభుత్వంలో అప్పటి వీసీ ప్రసాదరెడ్డి తన ఛాంబర్ కు పెట్టించిన గేట్లను ఇవాళ అధికారులు తొలగించారు. నిన్న రాష్ట్రంలో ప్రభుత్వం 17 యూనివర్శిటీలకు ఇన్ చార్జ్ వీసీల్ని నియమించింది. ఇందులో భాగంగా ఏయూ ఇన్ ఛార్గ్ వీసీగా నియమించిన శశిభూషణ్.. వచ్చీ రాగానే తన ఛాంబర్ ఎదురుగా ఉన్న గేట్లను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో సిబ్బంది ఉదయం ఈ గేట్లను తొలగించారు. దీంతో వీసీ ఛాంబర్ కు నేరుగా వెళ్లేందుకు వీలు కలిగింది. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
ఎక్స్ లో పెట్టిన పోస్టులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. “విద్యార్థులు పరిపాలనలోకి రాకుండా ఉండేందుకు గతంలో వీసీ వేసిన ఇనుప అడ్డంకులను బద్దలు కొట్టినందుకు ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శశిభూషణ్ గారిని అభినందిస్తున్నాను. విశ్వవిద్యాలయాలు నేర్చుకునే కేంద్రాలుగా నిలుస్తాయి. అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయ వాతావరణానికి విద్యార్థులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది మధ్య బహిరంగ సంభాషణ మరియు నమ్మకం చాలా కీలకం. బారికేడ్లు, దిగ్బంధనాల రోజులు పోయాయి. మార్పు నిజంగా ప్రారంభమైంది!” అంటూ వ్యాఖ్యానించారు.