దేశ మీడియా రంగంలో భారీ విలీనం చోటు చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాల్ట్ డిస్నీ ఇండియా తమ మీడియా వ్యాపారాలను విలీనం చేసింది. దీనికి సంబంధించి రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.
తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి 70,352 వేల కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటుకు నిర్ణయించాయి. సంయుక్త సంస్థలో రిలయన్స్ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్ గురించి ఎప్పటినుంచో ఉహాగానాలు.. ఉండగా దానికి తెర దించుతూ ఇరు సంస్థలు తాజాగా ప్రకటన విడుదల చేశాయి.
ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం కానుంది. జాయింట్ వెంచర్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది. విలీన సంస్థలో రిలయన్స్‌కు 16.34 శాతం, వయాకామ్ 18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు దఖలు పడనున్నాయి. ఈ మీడియా వెంచర్‌కు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్‌గా ఉంటారు.
భారత వినోద పరిశ్రమలో సరికొత్త శకానికి ఈ ఒప్పందం ద్వారా నాంది పలికినట్లు అయ్యిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ మీడియా గ్రూప్‌గా ఉన్న డిస్నీతో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దీని వల్ల తమ వ్యాపారాభివృద్ధితో పాటు దేశంలోని ప్రేక్షకులకు తక్కువ ధరకే కంటెంట్ అందించడానికి వీలు పడుతుందని చెప్పారు. డిస్నీని రిలయన్స్ గ్రూప్‌లో భాగస్వామిగా చేయడానికి.. ఆహ్వానమిస్తునట్లు తెలిపారు. రిలయన్స్‌తో ఒప్పందం ద్వారా దేశంలోనే అతిపెద్ద మీడియా కంపెనీగా అవతరించనున్నామని.. ప్రేక్షకులకు నాణ్యమైన ఎంటర్టైన్మెంట్.. స్పోర్ట్స్ కంటెంట్‌ను అందించడం వీలు పడుతుందని వాల్ట్ డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ పేర్కొన్నారు.
ఈ ఒప్పందానికి నియత్రణ సంస్థలు, వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. 2024 చివరిలో కానీ, 2025 తొలి త్రైమాసికానికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. విలీనానంతర సంస్థ దేశంలోని దిగ్గజ వినోద రంగ సంస్థల్లో ఒకటిగా నిలవనుంది. స్టార్ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 నుంచి 38 ఛానళ్లు కలిపి మొత్తం 120 టెలివిజన్ ఛానళ్లు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. ఇవి కాకుండా డిస్నీ హాట్‌స్టార్, జియోసినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉండనున్నాయి.