విశాఖపట్నం, డిసెంబర్ 1 (ఆంధ్రపత్రిక):
విశాఖ జిల్లాలో శుక్రవారం క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు ఒకటి కూడా జరగకపోవడంతో కక్షిదారులకు నిరీక్షణ తప్పులేదు. ఇటీవల 1.2 వెర్షన్ నుంచి 2.0 వెర్షన్కు రాష్ట్ర ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. గత నెల మొదటి వారంలో ఈ పద్ధతి ప్రవేశపెట్టడంతో అప్పట్లో క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల చేసుకునే కక్షి దారులు వ్యయ ప్రయాసలకు గురయ్యారు. మొదటి ఫేసులో కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచలుగా విశాఖపట్నం, అనకాపల్లి, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మూడు నాలుగు ఐదు ఫేసులు కూడా పూర్తయి రాష్ట్రవ్యాప్తంగా 2.0 పద్ధతిలో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్ వరకు సాఫీగా జరిగిన ప్రక్రియ నవంబర్లో కొత్త పద్ధతులు తీసుకువచ్చారు. విశాఖ జిల్లాలో 9 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్కో కార్యాలయంలో 20 నుంచి 50 వరకు ప్రతిరోజు క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అయితే 2.0 నూతన పద్ధతి ప్రవేశ పెట్టాక జిల్లాలో ఏ సబ్ రిజిస్టర్ కార్యాలయం చూసిన 10 నుంచి 15, 20 రిజిస్ట్రేషన్లు దాటని సందర్భాలు కనిపించాయి. గుడ్డిలో మెల్ల అనే చందంగా కొంచెం కొంచెం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మెరుగుపడుతుంది అనేసరికి, నవంబర్ పూర్తి అయ్యి డిసెంబర్లో అడిగి పెట్టిన తొలిరోజు బ్యాంకుల్లో చలానాలు చెల్లించి శుక్రవారం రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చిన వారికి ఒక్క రిజిస్ట్రేషన్ కూడా అవ్వకపోవడంతో కక్షిదారులు నిరాశ చెంది సాయంత్రం వరకు ఎదురు చూశారు. దీనిపై జిల్లా రిజిస్టార్ ను ఆంధ్రపత్రిక వివరణ కోరగా 2.0 పద్ధతి వల్ల కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ సర్వర్ పని చేయకపోవడం వలన కేవైసీ అవకుండా రిజిస్ట్రేషన్ కు వెళ్లడం జరగదని, అందుకని శుక్రవారం ఆధార్ కేవైసీ సర్వర్ పని చేయనందున రిజిస్ట్రేషన్లు జరగలేదని తెలిపారు.