ముంబై:బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలను స్పష్టమైన అపాయంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభివర్ణించారు. అంతర్లీనంగా ఏ విలువ లేకుండా, కేవలం నమ్మకం ద్వారా అధునాతన విధానంతో విలువను పొందే ఊహాగానం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ‘‘ఆర్థిక సేవల వ్యవస్థలో డిజిటలీకరణ క్రమంగా పెరుగుతున్న తరుణంలో సైబర్ దాడుల ముప్పు కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దృష్టి అవసరమ’’న్నారు. ఆర్బీఐ గురువారం విడుదల చేసిన 25వ ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎ్ఫఎ్సఆర్) ముందుమాటలో దాస్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. సంబంధిత వర్గాలు, సంస్థల నుంచి ఇప్పటికే సమాచారం సేకరించిన ప్రభుత్వం.. క్రిప్టోకరెన్సీలపై చర్చా పత్రాన్ని ఖరారు చేసే ప్రక్రియలో ఉంది.
విలువపరంగా తీవ్ర ఊగిసలాటలకు లోనవుతున్న ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ ముందు నుంచీ ప్రజలను హెచ్చరిస్తూనే వస్తోంది. వాటితో ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికీ భంగం కలుగవచ్చనీ పలు సందర్భాల్లో ఆర్బీఐ గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిణామాల కారణంగా గడిచిన కొన్ని వారాల్లో బిట్‌కాయిన్ సహా ఇతర క్రిప్టోల విలువ భారీగా పతనమైంది.
తను నియంత్రించే సంస్థలు క్రిప్టోలతో కార్యకలాపాలు లేదా లావాదేవీలు జరపకుండా నిషేధిస్తూ ఆర్బీఐ 2018లోనే సర్క్యులర్ జారీ చేసింది. కానీ, 2020లో సుప్రీంకోర్టు ఆ సర్క్యులర్‌ను కొట్టివేసింది. దేశంలో క్రిప్టో కరెన్సీలపై నియంత్రణకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ లాభాలపై ఇప్పటికే భారీగా పన్నులు విధించింది.
పునరుద్ధరణ పథంలో ఆర్థికం
అధిక ధరల ఒత్తిళ్లు, భౌగోళిక రాజకీయ సవాళ్ల నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ పథంలో ముందుకు సాగుతోందని ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఆర్బీఐ పేర్కొంది. ఊహించని షాక్‌లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బ్యాంక్‌లు, ఎన్‌బీఎ్‌ఫసీలు తగినన్ని మూలధన నిల్వలు కలిగి ఉన్నాయని.. మళ్లీ లాభాల్లోకి మళ్లుతున్నాయని తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ధరల కట్టడికి ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్‌లన్నీ వడ్డీ రేట్లను పెంచుతుండటంతో పాటు కరోనా మళ్లీ మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ మాత్రం అనిశ్చితిలో కూరుకుపోయిందని రిపోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
62,070 కోట్ల డాలర్లకు విదేశీ అప్పులు
ఈ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2021 -22) విదేశీ అప్పుల భారం మరో 4,710 కోట్ల డాలర్లు పెరిగి 62,070 కోట్ల డాలర్లకు చేరుకుందని ఆర్బీఐ వెల్లడించింది. జీడీపీతో విదేశీ అప్పుల నిష్పత్తి మాత్రం 19.9 శాతానికి తగ్గిందని తెలిపింది. 2021 మార్చి నాటికి ఈ నిష్పత్తి 21.2 శాతం గా నమోదైంది.
ఆరేళ్ల కనిష్ఠానికి మొండిబకాయిలు
ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంకింగ్ రంగంలో మొండి బాకీలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 5.9 శాతానికి తగ్గాయని ఆర్బీఐ వెల్లడించింది. 2023 మార్చి నాటికి 5.3 శాతానికి తగ్గే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చింది. చాలాకాలం తర్వాత బ్యాంక్‌ల రుణాలు రెండంకెల వృద్ధి నమోదు చేసుకోగలిగాయంది. అంతేకాదు, బ్యాంక్‌ల క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో (సీఆర్ఏఆర్) సరికొత్త గరిష్ఠ స్థాయి 16.7 శాతానికి చేరుకుందని రిపోర్టు వెల్లడించింది.