గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న టీఆర్పీ మాల్లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాల్లోని గేమ్ జోన్లో మంటలు చెలరేగాయి. ఇప్పటి వరకు 24 మంది మరణించినట్లు రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ ధ్రువీకరించారు.
మృతుల్లో చిన్నారులు ఎక్కువగా ఉన్నారని బీబీసీ ప్రతినిధి తెలిపారు.
మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంటలు ఎలా చెలరేగాయన్నది ఇంకా తెలియలేదని అగ్నిమాపక శాఖ అధికారి ఐవీ ఖేర్ చెప్పారు.
“ఈ ప్రమాదానికి కారణం ఏంటన్నది ఇంకా తేలలేదు. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మంటలను అదుపు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న తాత్కాలిక నిర్మాణం కూలిపోయింది. గాలి వేగం కూడా ఎక్కువగా ఉంది” అని ఆయన చెప్పారు.
భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయని, పొగ అయిదు కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తోందని బీబీసీ ప్రతినిధి బిపిన్ చెప్పారు. గేమ్‌జోన్‌లో చాలా మంది చిక్కుకుపోయారని ఆయన తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో మాల్లోని గేమ్ జోన్లో వెల్డింగ్ పని జరిగినట్టు తెలుస్తోందని, షార్ట్ సర్క్యూట్ ఈ అగ్నిప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారని బిపిన్ చెప్పారు.
“సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో టీఆర్పీ మాల్ గేమ్ జోన్లో మంటలు చెలరేగినట్లు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ కాల్ వచ్చింది. అగ్నిమాపక దళం వాహనాలు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాయి” అని బీబీసీ ప్రతినిధి బిపిన్ తంకారియాతో రాజ్‌కోట్ జిల్లా కలెక్టర్ ప్రభావ్ జోషి చెప్పారు.
ఈ ప్రమాదంలో 24 మంది చనిపోయారని రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ వార్తా సంస్థ ఏఎన్ఐతో చెప్పారు.
“ఇప్పటివరకు 24 మృతదేహాలను వెలికితీశారు. యువరాజ్ సింగ్ సోలంకి ఈ గేమ్‌జోన్ యజమాని. కేసు నమోదు చేస్తాం. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత తదుపరి దర్యాప్తు చేస్తాం” అని ఆయన అన్నారు.
“ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని కూడా పిలిపించాం. వారు వచ్చి పరిశీలించి ఈ అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణం ఏంటన్నది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు” అని పోలీసు కమిషనర్ చెప్పారు.
ఈ ప్రమాదం వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆప్తులను కోల్పోయిన సానుభూతి తెలుపుతున్నానని, క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఎక్స్‌లో పేర్కొన్నారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు.
రాజ్‌కోట్‌లోని గేమ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాదం గురించి సమాచారం అందగానే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చానని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో తెలియజేశారు.
క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించే ఏర్పాట్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు.