నరేంద్ర మోదీ 3.0 ఆదివారం నుంచి దేశంలో మొదలుకానుంది. రాష్ట్రపతి భవన్లో నేడు (జూన్ 9) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును ఆయన సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే, మిత్రపక్షాలతో కలిపి ఎడ్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించి మరోసారి మోదీ అధికారం అందుకున్నారు.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ముఖ్య నేతలు, ప్రముఖులు హాజరవుతున్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులు, మారిషస్‌తో సహా దేశాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ వేడుకల్లో సౌత్ ఇండియా స్టార్ హీరో రజనీకాంత్ కూడా ప్రత్యేకంగా పాల్గొననున్నారు. ఢిల్లీకి బయల్దేరిన రజనీ విమానాశ్రయానికి వెళ్లే ముందు బోయిస్ గార్డెన్స్‌లోని తన నివాసం ఎదుట విలేకరులతో ఇలా మాట్లాడారు.
‘ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తున్నాను. ‘జవహర్లాల్ నెహ్రూ తర్వాత మోదీ మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. భారత రాజకీయాల్లో ఆయన సాధించిన ఘనత అని చెప్పవచ్చు.’ అని ఆయన అన్నారు.
హిమాలయాల పర్యటన ముగించుకుని చెన్నైకి తిరిగి వచ్చిన రజనీకాంత్ ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాలో నటించబోతున్నాడు. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.