మాజీ మంత్రి విడదల రజనీ బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఆమె కొంత మంది బీజేపీ అగ్రనేతల్ని కలిసి పార్టీలో చేర్చుకోవాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు.
అయితే ఆమె ఇలా లీకులివ్వడానికి కారణం ఉందని.. టీడీపీలోకి ఆహ్వానిస్తారన్న ప్రణాళికతోనే ఇలాంటి రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. టీడీపీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికిప్పుడు టీడీపీలోకి నేతల్ని చేర్చుకునేందుకు సిద్ధంగా లేరు. అందుకే ఆమె బీజేపీ వైపు చూస్తున్నట్లుగా లీకులిస్తున్నారని అంటున్నారు.
విడదల రజనీ మొదట టీడీపీలో ఉండేవారు. మహానాడులో మాట్లాడేందుకు అప్పటి మంత్రి పుల్లారావు ఆమెకు చాన్సిచ్చారు. ఒక్క ప్రసంగంతో ఆమె ఆకట్టుకున్నారు. వెంటనే పుల్లారావు సీటుకే టెండర్ పెట్టారు. తనకు చిలుకలూరిపేట టిక్కెట్ ఇవ్వాలని కోరారు. అంగీకరించకపోవడంతో వైసీపీలో చేరారు. దండిగా డబ్బులు పెట్టే వారి కోసం చూస్తున్న జగన్ వెంటనే చాన్సిచ్చారు. అయితే ఐదేళ్లకే మొత్తం రాత మారిపోయింది. ఎమ్మెల్యే అయ్యారు.. మంత్రి అయ్యారు… ఇప్పుడు జీరో అయ్యారు. భవిష్యత్ పై భ యం కూడా ప్రారంభమయింది.
వైద్య ఆరోగ్య శాఖలో చాలా స్కాంలు జరిగాయి. వీటిలో విడదల రజనీకి తెలిసింది తక్కువ. సజ్జల నేతృత్వంలో చేసిన స్కాంలే ఎక్కువ. ఇప్పుడవన్నీ ఆమె మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముందు జాగ్రత్తగ పార్టీ మారిపోవడం మంచిదన్న ఆలోచనకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రయత్నాలు ఎక్కడి వరకు వస్తాయో చూడాల్సి ఉంది.