మచిలీపట్నం అక్టోబర్ 9 ఆంధ్ర పత్రిక.:
స్పందన అర్జీలలో నాణ్యత ప్రమాణాలను విధిగా పాటిస్తూ సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, మచిలీపట్నం ఆర్డిఓ శివ నారాయణ రెడ్డిలతో కలిసి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం నిర్వహించి పలు ప్రాంతాల ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించారు. సంబంధిత అధికారులను పిలిపించి అర్జీల పరిష్కారంపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా అధికార యంత్రాంగం స్వీకరించిన అర్జీలలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి.
అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామస్తులు మండలి వెంకటేశ్వరరావు, ఎం. సోమసుందర్రావు మరికొంతమంది మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో హిందూ స్మశాన వాటిక అనాదిగా కృష్ణానది ఒడ్డున శ్రీ వెంకటేశ్వర పుష్కర ఘాట్ నదీ తీరం వెంబడి బ్రాహ్మణ రేవు వరకు ఆర్ సి పోరంబోకు స్థలంలో దహన సంస్కారాలు జరుపుకుంటున్నామన్నారు. అది ప్రభుత్వ భూమి గా ఉన్నందువలన సర్వే నంబరు 6లో రెవెన్యూ రికార్డుల్లో అధికారికంగా నమోదు చేసి తమకు అందజేయాలని వారు విజ్ఞప్తి చేస్తూ అర్జీ అందజేశారు.
పామర్రు మండలం నిబానుపూడి గ్రామానికి చెందిన జుజ్జువరపు కోటేశ్వరరావు, డి నాగరాజు, కలవల మద్ది రావమ్మ మరో ఐదు మంది మాట్లాడుతూ ప్రభుత్వం 30 సంవత్సరాల క్రితం సీలింగ్ భూమిని సేకరించి నిరుపేదలైన 6 మందికి ఇచ్చారని, అందులో దాసరి సామ్రాజ్యం, దాసరి కృష్ణమూర్తి అనే దంపతులకు 0.25 సెంట్లు భూమిని ఇచ్చారని, ఐదు సంవత్సరాల క్రితం వారు చనిపోయారని, అప్పటినుండి వారి అన్న దాసరి వెంకటేశ్వర్లు కుమారుడు దాసరి సాయిబాబు దానిని సాగు చేసుకుంటున్నారని, సాయిబాబాకు ఎకరా 80 సెంట్లు పొలం ఉందని, నిరుపేదలైన తమకు లాటరీ ద్వారా లేదా తమరికి తోచిన విధంగా ఆ భూమిని ఇప్పించాలని వారు కోరుతూ వినతి పత్రం అందజేశారు.
బంటుమిల్లి వారవీధిలో నివాసం ఉంటున్న వీరంకి వెంకటేశ్వరరావు, వి. కోటేశ్వరరావు, వి. ధనలక్ష్మి తదితరులు మాట్లాడుతూ తమ వీధిలో నివాసం ఉంటున్న బసవ భాస్కర్ రావు తమ ఇంటి పక్కన కోళ్ల ఫారాలు పెద్ద ఎత్తున నడుపుతున్నారని, దాంతో తరచూ తాము అనారోగ్యానికి, గురవుతున్నామని, రాత్రి పగలు తేడా లేకుండా దుర్వాసన వస్తుందని, కోళ్ల ఫారాలు అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ విజ్ఞాపన పత్రంచేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రాంతాల నుండి ఎంతో శ్రమకోర్చి వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రానికి వస్తున్నారని స్పందన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సానుకూలంగా పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జ్యోతిబసు,డ్వామా, డిఆర్డిఏ పిడిలు జి.వి. సూర్యనారాయణ, పి ఎస్ ఆర్ ప్రసాద్,డిపిఓ నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, ముడా విసి రాజ్యలక్ష్మి, డీఈవో తాహేరా సుల్తానా, డి ఎస్ ఓ పార్వతి, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, పంచాయతీరాజ్ ఎస్ఈ విజయ్ కుమారి, ఐసిడిఎస్ పిడి సువర్ణ కుమారి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.