దిల్లీ: వైవాహిక బంధంలో వివాదాలకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ (CJI DY Chandrachud) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యవహారంలో సుదీర్ఘ న్యాయపోరాటం వల్ల అది న్యాయవాదులకే ప్రయోజనంగా మారుతుందని అన్నారు. అందువల్ల పరస్పర సమ్మతితో విడాకుల (Divorce)కు అంగీకరించాలని ఆ దంపతులకు సూచించారు.
తమ జంట మధ్య వివాదానికి సంబంధించిన కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈసందర్భంగా సదరు మహిళ విద్యార్హతలను చీఫ్ జస్టిస్ అడిగారు. తాను ఎంటెక్ పూర్తిచేసి, అమెరికా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందినట్లు ఆమె సమాధానమిచ్చారు. అయితే, ప్రస్తుతానికి తానేమీ ఉద్యోగం చేయట్లేదని పేర్కొన్నారు.
దీనికి సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ స్పందిస్తూ.. ”మీరు విద్యావంతులు. ముందు మంచి ఉద్యోగం సంపాదించండి. ఈ కేసులో మీరు 10 ఏళ్లయినా న్యాయపోరాటం చేయగలరేమో..! కానీ దానివల్ల కేవలం న్యాయవాదులకే ప్రయోజనం కలుగుతుంది. మీరెందుకు పరస్పర సమ్మతితో విడాకులు తీసుకునేందుకు అంగీకరించకూడదు? మీరు అందుకు అంగీకరిస్తే కేసును మూసేస్తాం. మీరు వైవాహిక బంధాన్ని తిరిగి కొనసాగించే పరిస్థితుల్లో లేరని స్పష్టమవుతోంది. మీరు నిరక్షరాస్యులైతే కేసు వేరేగా ఉండొచ్చు. కానీ మీరు చదువుకున్నవారు.. ఉద్యోగం సంపాదించగలరు” అని ఆ మహిళకు సూచించారు.