- పది గంటల్లోగా కేసును చేధించడం అభినందనీయం
- ఏపీ పోలీసుల పనితీరుకు ఈ ఘటన ఒక ఉదాహరణ
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని వ్యాఖ్యలు
- బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన మంత్రి విడదల రజిని
- కిడ్నాప్‌కు గురైన బాలుడిని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించడంలో చిలకలూరిపేట పోలీసుల కృషి ప్రశంసనీయం! రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
పల్నాడు జిల్లా, అక్టోబర్ 03 (ఆంధ్రపత్రిక): పట్టణంలో శరవణన రజిత్సాయి అనే 8 ఏళ్ల బాలుడు ఆదివారం రాత్రి చిలకలూరిపేటలో కిడ్నాప్‌కు గురికాగా సోమవారం ఉదయాని కల్లా బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టి ఇంటికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి బాధిత ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మంత్రి విడదల రజిని మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ కిడ్నాపైన బాలుడిని చిలకలూరిపేట పోలీసులు క్షేమంగా ఇంటికి చేర్చారని, వారి కృషి అభినందనీయమని తెలిపారు. బాలుడు కిడ్నాపైన విషయాన్ని నాయకులు సోమవారం రాత్రి తన దృష్టికి తీసుకొచ్చారని, తాను వెంటనే సీఐ, డీఎస్పీతోపాటు ఎస్పీని అప్రమత్తం చేశానని తెలిపారు. వెనువెంటనే స్పందించిన పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి చిలకలూరిపేట పోలీసులతో రెండు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటుచేసి అన్వేషణ కొనసాగించారని చెప్పారు.కావలి సమీపంలో దుండగులు బాలుడితోపాటు ఉన్నారని గుర్తించి, అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారని తెలిపారు. పోలీసులు తమను వెంబడిస్తున్నారనే విషయాన్ని గుర్తించిన దుండగులు బాలుడిని కావలి వద్ద జాతీయరహదారిపై వదిలేసి వెళ్లిపోయారని చెప్పారు. కిడ్నాపర్ల కోసం వేట కొనసాగుతోందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర పోలీసుల పనితీరు కు ఈ ఘటన ఒక ఉదాహరణ అని చెప్పారు. కుటుంబసభ్యులు మాట్లాడుతూ మంత్రి విడదల రజిని దృష్టికి తాము తమ కుమారుడు కిడ్నాపైన విషయాన్ని తీసుకెళ్లగానే.. ఆమె శరవేగంగా స్పందించారని, పోలీసులను అప్రమత్తం చేశారని, తమ కుమారుడు తమకు దక్కేలా చేశారని, ఆమె కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని ఆనందం వ్యక్తంచేశారు.డీఎస్పీ విజయ్‌భాస్కర్, సీఐ రాజేశ్వరరావు,యస్.ఐ ఫిరోజ్ తదితరులు ఉన్నారు.