మచిలీపట్నం నవంబర్ 16 ఆంధ్ర పత్రిక.:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ పంపిణీ వాహనాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటోను అమర్చాలని బీజేపీ యువమోర్చా డిమాండ్ చేసింది.
ప్రతి సంవత్సరం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 శాతం కంటే ఎక్కువ మంది పేదలకు రూ.6000 కోట్ల వ్యయంతో 17 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ప్రతినెలా రేషన్ ద్వారా అందిస్తున్నారని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కృష్ణా జిల్లా అధ్యక్షులు నాగలింగం అయోధ్య రామచంద్ర రావు అన్నారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్న 9260 రేషన్ వాహనాలకు అందించే సబ్సిడీలో 60 శాతం కేంద్రం మంజూరు చేసిందే అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రేషన్ ద్వారా ఆహార ధాన్యాలు అందజేస్తున్న రేషన్ పంపిణీ వాహనాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ యువమోర్చా తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు.
భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మిట్ట వంశీకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అక్రమాలపై ఎలాంటి పోరాటానికైనా మేమంతా సిద్ధంగా ఉన్నాం అనరు.
ఈ సంవత్సరం డిసెంబర్ 2వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9260 రేషన్ పంపిణీ వాహనాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటోను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ మరియు పౌర సరఫరాల అధికారులను మేము డిమాండ్ చేస్తున్నామన్నారు.
రానున్న రోజుల్లో ఈ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఈనెల 18వ తారీఖున మెమోరాండం అందజేస్తాం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు తమ డిమాండ్‌ను అంగీకరిస్తారని, రేషన్ పంపిణీ వాహనాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటోను ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించకుంటే, రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వాహనాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో ఏర్పాటు చేస్తామని బందరు నియోజకవర్గ బి.జే.పి. ఇంచార్జి సోడిశెట్టి బాలాజీ రావు అన్నారు.ప్రజా ప్రతినిధుల సమక్షంలో సంబంధిత అధికారులకు తెలియజేస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు మిట్ట వంశీ కృష్ణ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు ఆదేశాలతో డిసెంబర్ 3. వ తేది నుండి ప్రతి వాహనం మీద ప్రధాని ఫోటో అంటిస్తామని తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల రామాంజనేయులు , యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తిపాటి వెంకటరమణ జిల్లా సెక్రెటరీ వీరమల్లు అభినందన, కృష్ణాజిల్లా యువ మోర్చా కోశాధికారి ప్రసన్న కుమార్ యువమోర్చా కృష్ణాజిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పుప్పాల హరి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.