ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
శ్రీశైలం,డిసెంబర్21(ఆంధ్రపత్రిక): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించ నున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ’ప్రసాద్’ స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో దేవస్థానం పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం దేవస్థానం ఈవో లవన్న పర్యాటక శాఖ, దేవస్థాన అధికారులతో కలిసి క్షేత్ర పరిధిలో ఏర్పాట్లను పరిశీలించారు.ఆలయ ప్రాగణం, హేమరెడ్డి మల్లమ్మ మందిరం సవిూపంలో నిర్మించిన యాంపీ థియేటర్, హఠకేశ్వరం, శిఖరేశ్వరం వద్ద యాత్రికుల సౌకర్య కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పనుల్లో అలసత్వం చూపకుండా ఈ నెల 24వ తేదీ వరకు ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల సూచిక బోర్డులు పెట్టాలని ఆదేశించారు. ఈవో వెంట ఈఈ రామకృష్ణ, పర్యాటక శాఖ ఏఈ ఈశ్వరయ్య, దేవస్థాన డీఈ నర్సింహారెడ్డి, చంద్రశేఖరశాస్త్రి, నారాయణరావు, రంగ ప్రసాద్, రాజారావు, సీతారమేశ్, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.