భారతీయులకు సూచించిన దౌత్య కార్యాలయం
అబుధాబీ, దిల్లీ: అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్‌కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది.
అనూహ్య రీతిలో కురిసిన భారీ వర్షాల కారణంగా దుబాయ్‌లో విమానయాన కార్యకలాపాలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే విమానాలను దుబాయ్‌లోకి అనుమతిస్తున్నారు. దుబాయ్, చుట్టుపక్కల ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో విమాన ప్రయాణాలపై కొన్ని సూచనలు జారీ అయ్యాయి. విమానం బయల్దేరే తేదీ, సమయం గురించి సంబంధిత విమానయాన సంస్థల నుంచి ధ్రువీకరణవచ్చిన తర్వాతే విమానాశ్రయాలకు బయల్దేరాలనేది వాటిలో ఒకటి.
విమానాల రద్దు.. రీషెడ్యూల్ : విమానాల రాకపోకల పరంగా ఈ నెల 21 వరకు ఆంక్షలు ఉండడంతో శుక్రవారం ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్, ఇండిగో సంస్థలు దుబాయ్‌కి తమ సర్వీసులను రద్దు గానీ, రీషెడ్యూల్ గానీ చేశాయి. ఎయిరిండియా మొత్తం విమానాలను రద్దు చేసింది. శనివారం ఇవి పాక్షికంగా పునరుద్ధరణకు నోచుకునే అవకాశం ఉందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విమాన సర్వీసు రద్దయినప్పుడు ప్రయాణ తేదీని ఉచితంగా మార్చుకునేందుకు, లేదా పూర్తిమొత్తం వాపసు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
ముగ్గురి మృతి: భారీ వర్షాల కారణంగా దుబాయ్‌లో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వర్షాలతో బయటకు వచ్చే వీల్లేకపోవడంతో ఇంటినుంచి పనిచేసే అవకాశాన్ని ఉద్యోగులకు కల్పిస్తున్నారు. పరిస్థితులు కొద్దిగా మెరుగుపడినా అనేక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పొరుగున ఉన్న ఒమన్‌లో మృతుల సంఖ్య 21కి చేరింది. దుబాయ్‌లో ప్రవాస భారతీయ సంఘాలు తమ కార్యాలయాలను వరద బాధితులకు ఆశ్రయ కేంద్రాలుగా మార్చాయి. ప్రత్యేక వాట్సప్ గ్రూపుల ద్వారా పరస్పరం సహాయం చేసుకుంటున్నాయి.