మచిలీపట్నం అక్టోబర్ 9 ఆంధ్ర పత్రిక.:
సముద్రంలో 2 కిలోమీటర్ల 325 మీటర్ల సౌత్ బ్రేక్ వాటర్ గోడ నిర్మాణంలో భాగంగా 825 మీటర్లు ముందుకు..
నార్త్ బ్రేక్ వాటర్ గోడ నిర్మాణంలో 250 మీటర్ల కోర్ లయింగ్ దశ పూర్తి.40 ఎకరాల్లో బెర్త్ రిలేటెడ్ ఫైలింగ్ పనులు పూర్తి.సుమారు మూడున్నర లక్షల టన్నులకు పైగా కొండ రాళ్లు వినియోగం..!
నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వివిధ పనులు పురోగతిలో ఉన్నాయని కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి, ఏపీ మ్యారీ టైం బోర్డు సీఈవో ప్రవీణ్ కుమార్ లు క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో ఎయిర్ పోర్టులు ఓడరేవులు ఉన్న జిల్లాల కలెక్టర్లతో సంభాషించగా సోమవారం కృష్ణాజిల్లా కలెక్టర్ చాంబర్ లో కలెక్టర్ పి.రాజాబాబు ఈ వీసీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ పోర్టుల అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లాల వారీగా సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనుల పురోగతి గురించి చీఫ్ సెక్రటరీ కలెక్టర్ పి. రాజాబాబును వివరించమని కోరారు.
కలెక్టర్ మాట్లాడుతూ, మచిలీపట్నం పోర్టు పనులు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా కొనసాగుతున్నాయని, సముద్ర కెరటాలను అడ్డుకోవడానికి 2 కిలోమీటర్ల 325 మీటర్ల దక్షిణం, ఉత్తరం బ్రేక్ వాటర్ గోడల నిర్మాణాల భాగంగా ఇప్పటికి 825 మీటర్ల దూరం సముద్రంలోనికి కొండ రాళ్ళను పూడ్చుకుంటూ పటిష్టంగా మున్ముందుకు చొచ్చుకుపోతున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు చెప్పారు. సౌత్ నార్త్ బ్రేక్ వాటర్ వాల్స్ నిర్మాణం కొరకు ఇప్పటివరకు సుమారు మూడున్నర లక్షల టన్నులకు పైగా కొండ రాళ్లను సముద్రంలో పూడ్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సముద్రంలో మరోవైపు నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణంలో కోర్ లయింగ్ దశ 250 మీటర్ల నిడివి సైతం పూర్తయిందని ఆయన తెలిపారు.
మరోవైపు కస్టమ్స్, సెక్యూరిటీ తదితర భవనాల పునాది దశలో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 40 ఎకరాలలో బెర్త్ రిలేటెడ్ ఫైలింగ్ పనులు జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఏపీ మ్యారీ టైం బోర్డు సీఈవో ప్రవీణ్ కుమార్ లకు కలెక్టర్ పి రాజబాబు వివరించగా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. శివయ్య, మెఘా ఇంజనీరింగ్ సంస్థ పక్షాన రాఘవేంద్రరావు, రైట్ సంస్థ మేనేజర్ ఎంవిపి రవికుమార్, అసిస్టెంట్ మేనేజర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు