- సాయంత్రం 6 తరవాత కూడా భారీగా క్యూ లైన్లు
- సాయంత్రం 5గంటల వరకు 77.55శాతం ఓటింగ్ నమోదు
- క్యూలో ఉన్న వారందరికి ఓటేసే అవకాశం ఇస్తామన్న ఇసి
- పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూ కట్టిన ఓటర్లు
నల్లగొండ,నవంబర్ 3 (ఆంధ్రపత్రిక): మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. దీంతో మరో రెండు గంటలపాటు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. సా యంత్రం 5గంటల వరకు 77.55శాతం ఓటింగ్ నమోదు అయింది. మొత్తం 2లక్షల 41వేల 805 ఓట్లకు.. ఐదు గంటల వరకు లక్షా 87వేల 527మంది ఓట్లు వేశారు. ఉదయం పోలింగ్ కాస్త మంద గించినా.. మధ్యాహ్నం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 5గంటల లోపు దాదాపు 40శాతం పోలింగ్ నమోదు అయింది. మధ్యాహ్నం తర్వాత మహిళలు, యువత పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో.. పోలింగ్ లేట్ అయింది. అయినా ఓటర్లు గంటల తరబడి పోలింగ్ కేంద్రాల్లో వెయిట్ చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చివరి రెండు గంటల్లో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం తర్వాత మహిళలు, యువత పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో.. పోలింగ్ లేట్ అయింది. అయినా ఓటర్లు గంటల తరబడి పోలింగ్ కేంద్రాల్లో వెయిట్ చేసి ఓటు హక్కును వినియో గించుకున్నారు. చివరి రెండు గంటల్లో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మునుగోడులో పోలింగ్ సమయం ముగిసినా నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఇవిఎంలు మొరాయిస్తున్నాయి. ఓటర్లు ఓటు వేసేందుకు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. సాయంత్రం 6 గంటలు దాటినా ఈవీఎంలు పనిచేయకపోవడంతో దాదాపు 250 మంది ఓటర్లు టెంట్ల కింద కూర్చుని ఓటు వేసేందుకు నిరీక్షించారు. ఉదయం నుంచి వేచి చూసినా ఓటు వేయకపోవడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. 250 మందికి టోకెన్లు అందజేసిన అధికారులు..ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈవీఎంలు పనిచేస్తాయో లేదో కూడా సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. చౌటుప్పల్, నారాయణపురంలో భారీగా పోలింగ్ నమోదైంది. అయితే పోలింగ్ సమయం ముగిసే సమయానికి క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించనున్నారు. పలు చోట్ల మరో గంట పాటు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. ఓటేసేందుకు మహిళలు, వృద్ధులు, యువత బాగా ఆసక్తి చూపారు. మొత్తంగా మునుగోడులో భారీగా పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉంది. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. వీరి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఎన్నికల ఫలితాలు నవంబర్ 6వ తేదీన వెలువడనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని ఈసీ క్లోజ్‌గా మానీటరింగ్ చేసింది. మొత్తం 298 సెంటర్లలోనూ వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు గట్టిచర్యలు తీసుకున్నారు. మొదట ఉద్రిక్తతలు తలెత్తినా మధ్యాహ్నం నుంచి ఓటింగ్ ప్రశాంతంగానే కొనసాగింది. ఈ క్రమంలో గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఓటింగ్ బహిష్కరించారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు డబ్బులు పంచుతామని చెప్పి డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. డబ్బులు తెచ్చుకొని నేతలు ఇంట్లో దాచుకున్నారు. తులం బంగారం, డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ ఓటర్లు ఆరోపించారు. పక్క గ్రామాల్లో డబ్బులు పంచారు. మేము ఏమి అన్యాయం చేశామంటూ.. దూర ప్రాంతాల నుంచి వచ్చామని.. కానీ ఇవ్వలేదంటూ పేర్కొన్నారు. డబ్బులు పంచితేనే ఓట్లు వేస్తామని ఓటర్లు ఖరాఖండిగా పేర్కొన్నారు..