హైదరాబాద్: ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటికి అరెకపూడి గాంధీ వెళ్లారు.
పెద్ద ఎత్తున తన అనుచరులతో బయల్దేరి వెళ్లారు. గాంధీ ఇంటికి వెళ్లి భారాస కండువా కప్పుతానని ఇటీవల కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై అరెకపూడి గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు.
ఎన్నికల్లో గెలిపించకపోతే చనిపోతానని భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్రెడ్డిలాంటి కోవర్టులకు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తన ఇంటికి ఆయన రాకపోతే.. తానే ఆయన ఇంటికి వెళతానని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి ఇంటికి అరెకపూడి గాంధీ వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కొంతమంది అరెకపూడి అనుచరులు కౌశిక్‌రెడ్డి ఇంటి గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించారు.
అక్కడే బైఠాయించిన అరెకపూడి గాంధీ.. అరెస్ట్
కౌశిక్‌రెడ్డి ఇంటివద్ద తన అనుచరులతో కలిసి అరెకపూడి గాంధీ బైఠాయించారు. పోలీసులు ఆయన్ను పంపించే ప్రయత్నం చేయగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్‌రెడ్డిని బయటకు పిలవాలని.. లేదంటే తననే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అరెకపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరు అనుచరులు గేటు తోసుకుంటూ కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.
అంతకుముందు అరెకపూడి గాంధీ మీడియాతో మాట్లాడారు. భారాసలోకి వచ్చినప్పటి నుంచి కౌశిక్‌రెడ్డి తీరు సరిగా లేదన్నారు. ఆయన తీరు వల్లే ఆ పార్టీ ఓటమి పాలైందని విమర్శించారు. ఆయన కోవర్టుగా వ్యవహరించారన్నారు. కౌశిక్‌రెడ్డి వ్యక్తిత్వం తెలుసుకోకుండా భారాసలో స్థానం కల్పించారని మండిపడ్డారు. ఆయన ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.