ది.31.08.22న జరుగనున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరంలో వినాయక పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ నిర్వాహకులు తప్పని సరిగా ముందస్తు పోలీసు అనుమతి పొందాలని తెలియజేస్తున్నాము. అనుమతి కొరకు సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న సమీకృత పోలీస్ సేవా కేంద్రం (UPSC) నందు దరఖాస్తులు సమర్పించాలి. సమర్పించిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన మీదట అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సమీకృత పోలీస్ సేవా కేంద్రం పనిచేయును. ప్రతి సంవత్సరం మాదిరిగా మున్సిపల్, పంచాయతీ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ శాఖ నుండి ముందుగా పొందిన అనుమతి పత్రాలతో పాటు అన్ని వివరాలు పొందుపరిచిన అర్జీని అందించాలి.
పండుగ రోజు నుండి జరిగే ఈ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు ప్రమాదాలు జరుగకుండా మరియు ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ క్రింది తెలియజేసిన కొన్ని నియమ నిబంధనలు మరియు భద్రతా చర్యలను ఉత్సవ నిర్వాహకులు పాటించాలని తెలియజేస్తున్నాము.
నియమ నిబంధనలు, ముందస్తు జాగ్రత్తలు:
వినాయక “విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళను” ఏర్పాటు చేసుకోవడానికి మరియు “ఊరేగింపునకు” తప్పని సరిగా పోలీసు వారి అనుమతి తీసుకోవాలి.
వినాయక చవితి పందిళ్ళ ఏర్పాటుకు ముందుగా మున్సిపాలిటీ, ఫైర్, ఎలక్ట్రికల్ మరియు పంచాయితీ శాఖల అనుమతి(NOC) పొందిన తరువాత మాత్రమే పోలీస్ శాఖ అనుమతి పొందవలసి వుంటుంది.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పోలీస్ అధికారిని మిగతా అన్ని శాఖలు మరియు మండపాల ఆర్గనైజింగ్ కమిటి వారితో సమన్వయకర్తగా వ్యవహరించడానికి నియమించడం జరుగుతుంది. ఆర్గనైజింగ్ కమిటీ వారికి ఏవిధమైన సమస్య లేక సందేహాలు వచ్చినా ఈ సమన్వయ అధికారిని గాని, ఆ ఏరియా పోలీస్ స్టేషన్ని గాని, లేక 100కు గాని సంప్రదించవల్సిందిగా కోరుతున్నాము.
మండపాల వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ మరియు నియంత్రణ నింబంధనలు-2000 ప్రకారం రెసిడెన్సియల్ ఏరియా నందు పగలు 55, రాత్రి 45 డెసిబల్స్ కు మించకుండా ఉండే విధంగా బాక్స్ టైపు స్పీకర్లను ఉపయోగించాలి. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలి.
లౌడ్ స్పీకర్లను సాయంత్రం6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మరియు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి స్పీకర్లను ఎట్టిపరిస్థితులలోను ఉపయోగించరాదు.
విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య. నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం మరియు విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియజేయాలి.
మండపాలలో దీపారాధనల వలన అగ్నిప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలి. విద్యుత్ వైర్లను మరియు ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రతలు వహించాలి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరుగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలి.
భద్రత కొరకు రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలి. మండపాల వద్ద ఏ విధమైన అగ్ని ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు నీరు, ఇసుకను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పందిరివద్ద నిర్వహకులు సి.సి.టి.వి కెమెరాలు ఏర్పాటు చేసుకొనవలెను మరియు 24/7 సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకొనవలెను. ఎవరికి వారు తగు భద్రతా ఏర్పాట్లు చేసుకొనవలెను.
మండపం యొక్క పటిష్టతను దృష్టిలో ఉంచుకుని పూజ నిర్వహించే సమయంలో మండపంపై ఎక్కువ మంది జనం లేకుండా చూడాలి. విగ్రహ పందిళ్ళ చుట్టుప్రక్కల వాహనాలను పార్కింగ్ చేయరాదు. పందిళ్ళకు దూరంగా పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలి.
వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశం గాని రోడ్డుపైన ఉండరాదు. బ్యానర్లు కాని, ప్లెక్సీలు గాని రోడ్డుపైన పెట్టరాదు. వినాయక పందిళ్ళ వలన ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించరాదు.
ఊరేగింపు సమయంలో ఇతర కులాలు, మతాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ప్లకార్డులు మరియు బ్యానర్లు ప్రదర్శించడం చేయరాదు. అలాగే ఊరేగింపుతో పాటు వెళ్ళే మతనాయకులు వేరే మతాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వకుండా మత సామరస్యం పాటించాలి.
ఆయా పరిసర ప్రాంతాల్లో అనుమానిత క్రొత్త వ్యక్తుల సమాచారం గురించి గాని వదలి వేసిన వస్తువుల గురించి గాని ఉత్సవ నిర్వాహకులు వెంటనే పోలీసు వారికి తెలియజేయాలి.
ఆ విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో గులాల్ లు/రంగులు చల్లడం, లౌడ్స్పీకర్లు ఉపయోగించడం, మందుగుండు సామాగ్రిని పేల్చడం చేయరాదు.
ఊరేగింపు సమయంలో పోలీస్ వారి అనుమతి లేకుండా వేషధారణలు ఎక్కువ శబ్ధము వచ్చే వాయిద్యాలు అనగా డి.జే. మొదలుగునవి అనుమతించరాదు.
పందిళ్ళ వద్ద మరియు ఊరేగింపు సమయాలలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నాట్య ప్రదర్శనలు జరుగకుండా మరియు మద్యం లేదా మత్తు పదార్ధాలను సేవించిన వారు లేకుండా ఉండే విధంగా ఉత్సవ నిర్వాహకులు బాధ్యత వహించాలి.
ప్రజల సౌకర్యార్ధం సీతమ్మవారి పాదాల వద్ద వినాయక విగ్రహాల నిమర్జనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.
విగ్రహ ఊరేగింపు సమయంలో భారీ వాహనాలు పెట్టరాదు. లారీల పైగాని ట్రాలీలపైగాని ఆర్కెస్ట్రాలను వినియోగించరాదు.
ఊరేగింపు సమయంలో కర్రలు, ఇతర ఆయుధములు ధరించి పాల్గొనరాదు.
నిమర్జన ఊరేగింపుకు అనుమతించిన సమయం, రూటు ఖచ్చితంగా పాటించవలెను.
ఊరేగింపు సమయంలో ట్రాఫిక్కు ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు మరియు భద్రత కొరకు తగినంత మంది వాలంటీర్లను ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అర్జీదారుడు మరియు కార్యనిర్వాహకులు బాధ్యత. వహించవలసి ఉంటుంది.
వినాయక ఉత్సవ వేడుకల సందర్భంగా నగర ప్రజలకు మరియు నగరంలో ట్రాఫిక్ పరిస్థితికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉత్సవ నిర్వాహకులు పైన పేర్కొన్న ముందస్తు జాగ్రత్తలు పాటించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని తెలియజేస్తున్నాము.