PM Modi Calls Amit Shah: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడి ఢిల్లీ వరదలపై ఆరా తీశారు. యమునా వరద పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు.
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడి ఢిల్లీ వరదలపై ఆరా తీశారు. యమునా వరద పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఫ్రాన్స్ పర్యటనలో బీజిగా ఉన్నప్పటికీ.. మోడీ అమిత్ షా కు ఫోన్ చేయగా.. ఆయన వరద పరిస్థితి గురించి ప్రధానికి పూర్తి సమాచారాన్ని అందించారు. రానున్న 24 గంటల్లో ఢిల్లీలో వరదల పరిస్థితి తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని ప్రధాని మోదీకి తెలిపారు. ఢిల్లీలో ఎన్డిఆర్ఎఫ్ బృందాలను మోహరించామని.. అన్ని అధికార బృందాలు అలర్ట్ గా ఉన్నాయని తెలిపారు. అవసరాన్ని బట్టి నిరంతరం ఎన్డీఆర్ఎస్ బృందాలు పనిచేస్తున్నాయని అమిత్ షా ప్రధాని మోదీకి తెలియజేశారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో కూడా ప్రధాని మాట్లాడారు. ఈ వరద పరిస్థితిపై ఎల్జీ తో సమీక్షించారు. కేంద్రం అన్ని విధాలా సహాయం చేస్తుందని మోడీ హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఫ్రాన్స్, యూఏఈ పర్యటనకు గురువారం వెళ్లిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్ లో పర్యటన అనంతరం.. యూఏఈలో పర్యటించనున్నారు.
కాగా.. భారీగా కురుస్తున్న వర్షాలతో యమునా నది పొంగిపొర్లింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) వరద పర్యవేక్షణ పోర్టల్ ప్రకారం.. పాత రైల్వే వంతెన వద్ద మధ్యాహ్నం 1 గంటలకు నీటి మట్టం 208.62 మీటర్లకు పెరిగింది. ఇది సాయంత్రం 4 గంటల వరకు స్థిరంగా ఉంది. యమునా నీటిమట్టం స్థిరంగా ఉందని సీడబ్ల్యూసీ డైరెక్టర్ శరద్ చంద్ర తెలిపారు. శుక్రవారం మరింత తగ్గే అవకాశం ఉంది. కాగా.. ఢిల్లీలో వరదల వంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, జూలై 16 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.