ఎప్పుడైనా సరే నామినేషన్ ప్రక్రియను సింపుల్గా చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరుతూ ఉంటుంది. కానీ రాజకీయ నేతలు అలా చెయ్యరు. భారీ హంగామా చేస్తారు.
తమతోపాటూ.. పెద్ద ర్యాలీ నిర్వహిస్తారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మినహాయింపు కాదు అని నిరూపిస్తున్నారు. ఇవాళ మరోసారి వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేస్తున్న ప్రధాని మోదీ.. ఈ కార్యక్రమంలో 12 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనేలా ప్లాన్ చేశారు. అలాగే.. ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరవ్వబోతున్నారు.
ఈసారి ఎన్నికల్లో ఎన్డీయేకి మ్యాజిక్ మార్క్ రావడమే కష్టం అని ఇండియా కూటమితోపాటూ.. కొన్ని ప్రతిపక్షాలు అంటుంటే.. సొంతంగా 370, కూటమితో కలిసి 400 సీట్లు సాధించాలనుకుంటున్న బీజేపీ.. భారీ ప్రచారంతో ప్రతిపక్షాలకు షాక్ ఇస్తోంది. నిన్న వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించిన మోదీ.. దాని తోనే.. తాను ఏం చేసినా భారీగానే ఉంటుందని మరోసారి ప్రతిపక్షాలకు సంకేతం ఇచ్చారు. ఇవాళ నామినేషన్ సందర్భంగా.. భారీ రోడ్ షో, ప్రచార సభ జరగనున్నాయి. అందుకే.. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు.
వారణాసిలో ప్రధాని నామినేషన్ దాఖలుకు ముందు కాశీ విశ్వనాథుడు, కాలభైరవ ఆలయాలను దర్శించుకునే చాన్స్ ఉంది. బనారస్ హిందూ వర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు 5 కిలోమీటర్ల మార్గంలో 4 గంటలపాటు రోడ్ షో నిర్వహిస్తారు. అలాగే ఇవాళ ఎన్డీఏ నేతల సమావేశంలో కూడా మోదీ పాల్గొంటారు.
వారణాసికి చంద్రబాబు, పవన్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ వారణాసికి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోది వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేస్తున్న సందర్భంగా వీరిద్దరికీ ఆయన నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని ప్రధాన పార్టీల నేతలకూ కూడా మోదీ ఆహ్వానం పలికారు.
ఏపీలో కూటమి గెలుపు ఖాయం అని బీజేపీ భావిస్తోంది. ఈ కారణంగానే.. కూటమిలో భాగమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సేవల్ని దేశవ్యాప్తంగా వినియోగించుకునేందుకు బీజేపీ సిద్ధపడింది. ఇలా వీరిద్దరికీ ఆహ్వానం పపడం ద్వారా.. ఏపీలో వైసీపీకి వ్యతిరేక సంకేతాలు కూడా పంపినట్లైంది. అందువల్లే మోదీ నామినేషన్ అంశం ఇప్పుడు ఏపీలో కూడా హాట్ టాపిక్ అవుతోంది.
ఇవాళ బీజేపీ బహిరంగ సభలో పాల్గొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఇవాళ రాత్రికి చంద్రబాబు తిరిగి ఉండవల్లికి రానున్నారు.
బీజేపీకి కంచుకోట:
వారణాసి అనేది బీజేపీకీ, మోదీకీ కంచుకోటగా మారంది. మోదీ ఇప్పటికే రెండుసార్లు అంటే.. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచే గెలిచారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మోదీ 6,74,664 ఓట్లతో గెలిచి 63.6 శాతం ఓట్లను సాధించారు. 2014లో మోదీ గుజరాత్లోని వడోదర, ఉత్తరప్రదేశ్లోని వారణాసి.. రెండు లోక్సభ స్థానాలకూ పోటీ చేశారు. యూపీలో బీజేపీని బలపరిచేందుకూ.. హిందీ బెల్టులో తన స్థాయిని పెంచుకునేందుకూ మోదీ.. వారణాసిని ఎంచుకున్నారు. అక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ఈ నియోజకవర్గం మోదీ అడ్డాగా మారింది. మరోసారి ఆయనకు భారీ మెజార్టీ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.