ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించడానికి కొత్త సూచనలు చేయాలని కృష్ణా ట్రిబ్యునల్‌ను కేంద్రం కేబినెట్ కోరింది. దీంతో కృష్ణా జలాల వివాదానికి ఫుల్స్టాప్ పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అనురాగ్ ఠాకూర్. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించడానికి కొత్త సూచనలు చేయాలని కృష్ణా ట్రిబ్యునల్‌ను కేంద్రం కేబినెట్ కోరింది. దీంతో కృష్ణా జలాల వివాదానికి ఫుల్స్టాప్ పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పసుపు ఎగుమతులను రూ.8000 కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రమంత్రి అనురాగ్ఠాకూర్ తెలిపారు. ములుగులో గిరిజన యూనివర్సిటీకి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.880 కోట్లతో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. సమ్మక్క -సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు అనురాగ్ ఠాకూర్.
మరోవైపు కృష్ణా జలాల్లో వాటాలు తేల్చాలని పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ప్రధాని మోదీ తెలంగాణ టూర్‌కు వచ్చే ముందు కూడా ఇదే డిమాండ్ పెట్టింది బీఆర్ఎస్. ఇక తాజాగా ట్రిబ్యునల్ ఏర్పాటుతో జలాల లెక్క తేల్చే పనిలో పడింది కేంద్రం. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాజలాల వాటా 811 టీఎంసీలు కాగా.. రాష్ట్ర విభజన తర్వాత 2017లో కృష్ణా జలాల పంపిణీలో ఏపీకి 66శాతం, అంటే 512 టీఎంసీలు కేటాయింపు చేశారు. అలాగే తెలంగాణకు 34 శాతం, అంటే 298 టీఎంసీలు కేటాయింపు జరిగింది. ఈ విధంగా కృష్ణాజలాల పంపిణీపై రెండు రాష్ట్రాలు తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాయి. కానీ తెలంగాణకు 50% నీటి వాటాను తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మోదీ పాలమూరు సభకు ముందు మాత్రమే కాదు.. గతంలో బీజేపీఅగ్రనేతలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ నేతలు ఈ విమర్శలే చేసేవారు. కృష్ణా జలాల వాటా తేల్చాలని డిమాండ్ చేసేవారు. ఇక బీఆర్ఎస్ చేస్తున్న ఈ విమర్శలకే కేబినెట్ నిర్ణయాలతో చెక్‌పెట్టే ప్రయత్నం చేస్తోంది కేంద్రం.
మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల వాటా పంపిణీ కోసం ట్రిబ్యూనల్‌కు జారీ చేసిన కొత్త సూచనలతో తెలంగాణలో 50 లక్షల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి, టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందనే విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.