ఉపాధి పేరుతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోకి తెలంగాణ యువకుడు
రష్యా నుంచి తిరిగొచ్చాక తల్లిదండ్రులు నసీమా, జవహర్‌తో సుఫియన్
నారాయణపేట, నారాయణపేటకు చెందిన సయ్యద్ మహమ్మద్ సుఫియన్ కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు 2021లో దుబాయ్ వెళ్లాడు.
ఎమిరేట్్సలో నెలకు రూ.30వేల వేతనంతో వంట విభాగంలో పనిచేశాడు. రష్యాలో సెక్యూరిటీ ఉద్యోగాలు ఉన్నాయని, రూ.లక్ష వరకు జీతం వస్తుందని తెలిసి ఆశతో దుబాయ్‌లో ఏజెన్సీని సంప్రదించి రూ.3లక్షలు ముట్టజెప్పాడు. ఆ ఏజెంట్ సుఫియన్తోపాటు మరో ముగ్గురిని రష్యాలోని మాస్కోలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అక్కడి సైన్యం వీరికి ఆర్మీ దుస్తులు వేయించి హెలికాప్టర్లో రష్యా- ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలోని ఓ శిబిరంలో వదిలిపెట్టింది.
8నెలలపాటు వీరు అక్కడ నరకం అనుభవించారు. వీరితో తుపాకులు పేల్చడం, బాంబులు విసరడం, బంకర్లు తవ్వడం, యుద్ధంలో గాయపడిన రష్యా సైనికులను మోసుకెళ్లడం, ప్రథమ చికిత్స అందించడం వంటివి చేయించారు. భాషా సమస్య, అక్కడి ఆహారం తినడానికి ఇబ్బంది ఎదురవ్వడంతో అల్లాడిపోయారు.. బాంబు మోతల మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.
ఏజెంట్ చేతిలో మోసపోయిన విషయాన్ని వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో నారాయణపేట ఎమ్మెల్యే డా.చిట్టెం పర్నికారెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం ఈ విషయమై స్పందించారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా ప్రభుత్వంతో సంప్రదించి ఇటీవల విముక్తి కల్పించారని సుఫియన్ చెప్పారు. అంతకుముందు హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అఫ్సాన్ అనే యువకుడు ఇలానే ఉపాధికి వెళ్లి ఉక్రెయిన్ యుద్ధంలో మృతిచెందాడు.