- ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
- గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గం
- కాలుష్య కారకాల పట్ల సమాజంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్న బిశ్వభూషణ్
విజయవాడ,అక్టోబరు 10(ఆంధ్రపత్రిక): వాతావరణ అసమతౌల్యతను ఎదుర్కోవటానికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గవర్నర్ సమక్షంలో విజయవాడ రాజ్ భవన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గం సోమవారం బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ చెట్లు పర్యావరణ నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, ఆరోగ్యకరమైన పరిసరాలను అందిస్తాయన్నారు. మితిమీరిన ప్లాస్టిక్ వాడకం పర్యావరణ కాలుష్యానికి దారితీస్తుందని, దేశంలో ప్రతిరోజూ 26,000 టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తుండగా, అందులో 40శాతం వీధులు, నదులలో చెత్తగా మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసారు. ప్లాస్టిక్‌ను మితిమీరి వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై రెడ్‌క్రాస్ సభ్యులు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌ను వాడవద్దని ప్రధాని దేశ వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారని గవర్నర్ గుర్తు చేసారు. ప్రస్తుతం సమాజాన్ని ప్రభావితం చేస్తున్న గ్లోబల్ వార్మింగ్, వాయు, నీటి కాలుష్యం, ఎరువుల మితిమీరిన వినియోగం నష్టాల పట్ల నేటి యువతకు విస్తృత అవగాహన కల్పించవలసిన బాధ్యత రెడ్ క్రాస్ తీసుకోవాలని గవర్నర్ స్పష్టం చేసారు.మానవ సేవయే మాధవ సేవ అన్న అంశాన్ని గుర్తెరిగి వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో రక్తం అందుబాటులో లేక ఏ ఒక్కరూ ప్రాణం కోల్పోరాదని, తదనుగుణంగా రక్త సేకరణ యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖ నూతన అధ్యక్షుని ఎన్నికైన డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నూతన జిల్లాల నేపధ్యంలో కార్యవర్గాన్ని విస్రృత పరిచామని, ఆదే స్దాయిలో సేవా కార్యక్రమాలను పటిష్టపరుస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గవర్నర్ ఆదేశాల మేరకు క్షేత్ర స్ధాయిలో సేవా కార్యక్రమాలు అమలు అయ్యేలా ప్రణాళిక సిద్దం చేస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి ఎకె ఫరీడా మాట్లాడుతూ వ్యధాన్యుల నుండి నిధుల సమీకరణను పెద్దఎత్తున చేపట్టి అవసరమైన విభాగాలలో వాటిని వ్యయం చేస్తామని, మొక్కల పెంపకానికి సంబంధించి జిల్లా స్ధాయి ప్రణాళిక సిద్దం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ రాజ్ భవన్ ఆవరణలో మొక్కలు నాటారు. సోమవారం రాష్ట్ర ప్రధమ పౌరురాలి జన్మదినం కాగా పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక్ ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ నూతన కార్యవర్గం: గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పి.జగన్ మోహన్ రావు (శ్రీకాకుళం), ఎం.శ్రీరాములు (మన్యం), కెఆర్ డి ప్రసాదరావు (విజయనగరం), డాక్టర్ శివనాగేంద్ర (విశాఖపట్నం), ఎస్వి సాయి కుమార్ (అనకాపల్లి), జె.మహేష్ బాబు (కాకినాడ), వై మదుసూధన రెడ్డి (రాజమండ్రి), కె సత్యన్నారాయణ (కోనసీమ), బివి కృష్ణా రెడ్డి (ఏలూరు), ఎంఎస్ విఎస్ భద్రిరాజు (భీమవరం), కె రమేష్ (కృష్ణా), పి.రామచంద్రరాజు (గుంటూరు), డాక్టర్ కె శ్రీనివాస రెడ్డి (బాపట్ల), డాక్టర్ జగన్మోహన్ రెడ్డి (పల్నాడు), డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి (ప్రకాశం), డి.రవి ప్రకాష్ (నెల్లూరు), పి దస్తగిరి (నంధ్యాల), వి రమేష్ బాబు (చిత్తూరు), డాక్టర్ వి ప్రసాద్ (తిరుపతి) ఉన్నారు.