అతీక్ సోదరుల హంతకులను విచారించే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి. వాస్తవానికి అతీక్ సోదరులను కోర్టు వద్దే హత్య చేయాలని తొలుత భావించారు. కానీ, అక్కడ వీరి పథకం అమలు చేయడం సాధ్యం కాలేదు.
ఇంటర్నెట్‌డెస్క్: ఉత్తరప్రదేశ్(UP)కు చెందిన డాన్ అతీక్ అహ్మద్(Atiq Ahmed), అతడి సోదరుడు అష్రాఫ్‌ను ఒక రోజు ముందే చంపాలని హంతకులు ప్లాన్ వేసుకొని కాపుకాచారు. అతీక్, అష్రాఫ్‌ను ఏప్రిల్ 14వ తేదీన ప్రయాగ్‌రాజ్ కోర్టులో హాజరుపర్చడానికి తీసుకొచ్చిన సమయంలో హత్య చేయాలని లవ్లేశ్, సన్నీ, అరుణ్ ప్రయత్నించారు. కానీ, కోర్టు వద్ద భారీగా భద్రత ఉండటంతో తమ ప్లాన్ అమలు చేయడం కష్టమని వారికి తెలిసిపోయింది. దీంతో ఆ రోజు హత్య పథకం నుంచి వెనక్కి తగ్గారు. ఆ మర్నాడు రాత్రి ఆస్పత్రి వద్ద కొంత తక్కువగా ఉండటంతో ఈ ముగ్గురు అతిసులువుగా అతీక్, అష్రాఫ్‌ను హత్య చేశారు.అతీక్ హత్యకోసం ప్రయాగ్ రాజ్ వచ్చిన వీరు రైల్వేస్టేషన్ సమీపంలోని ఒక హోటల్లో ఉన్నారు. హత్య జరిగిన కెల్విన్ ఆస్పత్రి ఇక్కడకు కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. హత్య చేసే రోజునే వారు ఆస్పత్రి వద్ద కూడా రెక్కీ నిర్వహించారు.ఈ ముగ్గురు నిందితుల్లో ఒకరైన సన్నీ ఇంటరాగేషన్‌లో కీలక విషయాలు వెల్లడించాడు. 2021 మేలో ప్రముఖ గ్యాంగ్‌స్టర్ జితేంద్రమాన్ గోగి నుంచి జిగాన పిస్తోల్‌ను తీసుకొన్నట్లు వెల్లడించాడు. అదే ఏడాది దిల్లీలోని ఓ కోర్టు రూమ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో గోగి మరణించాడు. సన్నీ మాటల్లో నిజానిజాలను నిర్ధారించుకోవడానికి పోలీసులు ఈ ముగ్గురికి నార్కో పరీక్షలు నిర్వహించనున్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను చూసి సన్నీ సింగ్ కూడా ఓ పెద్ద హత్యకు ప్లాన్ చేసినట్లు చెబుతున్నాడు. బిష్ణోయ్ గ్యాంగ్ వలే అతీక్ హంతకులు కూడా జిగాన తుపాకులను వాడారు. లారెన్స్ గ్యాంగ్ కూడా ప్రముఖ గాయకుడు మూసేవాల హత్యకు ఈ తుపాకులనే వినియోగించారు. డమ్మీ మైకు, కెమెరా కూడా గోగి గ్యాంగ్ నుంచే సరఫరా అయినట్లు అనుమానిస్తున్నారు. ఇక హంతకులు ముగ్గురూ మూడు మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసినా వాటిని వినియోగించలేదు. ఫేక్ సిమ్ కార్డులను కొనుగోలు చేయడం సాధ్యం కాకపోవడమే దీనికి ముఖ్యకారణం.అతీక్ అహ్మద్ అనుచరుల్లో కీలకమైన గుడ్డూ ముస్లిం కదలికలు ఒడిశాలోని పూరి క్షేత్రంలో గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎస్టీఎఫ్ బృందాలు అతడిని అదుపులోకి తీసుకొనేందుకు చర్యలను ముమ్మరం చేశాయి. గుడ్డూ ముస్లిం బాంబుల తయారీలో సిద్ధహస్తుడన్న విషయం తెలిసిందే.