జగనన్న ఆలోచనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు:- రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
ఇక మన ఇంటికే డాక్టర్
104 వాహనాల ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం
సామాన్యులకు మరింత చేరువగా ప్రభుత్వ వైద్యం
హెల్త్ రికార్డులు ఇక పక్కాగా ఉంచొచ్చు
ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ఎంతో గొప్పది
సీఎం పర్యటన నేపథ్యంలో ఫ్యామిలీ డాక్టర్ గురించి వివరాలు వెల్లడించిన మంత్రి
లింగంగుంట్లలో ఏర్పాట్ల పరిశీలన
చిలకలూరిపేట, ఏప్రిల్ – 4, (ఆంధ్ర పత్రిక):- ప్రభుత్వ వైద్యుడే మన ఇంటికి వచ్చి ఉచితంగా వైద్య సేవలు అందించే రోజులు వచ్చేశాయీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. చిలకలూరిపేట రూరల్ మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో లింగంగుంట్లలో చేస్తున్న ఏర్పాట్లను మంత్రి విడదల రజిని మంగళవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఎల్.శివశంకర్, రవిశంకర్‌రెడ్డి, జేసీ, ఏఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో ఏకంగా 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటుచేసిందని తెలిపారు. ప్రతీ గ్రామంలోనూ అందుబాటులో ఉన్న ఆశా వర్కర్లకు తోడుగా ఏ.ఎన్.ఎం.లు, ఎంఎల్ హెచ్ పీ( మిడ్ లెవెల్ హెల్త్ ప్రోవైడర్) లను ఈ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లో నియమించామని పేర్కొన్నారు.
104వాహనాల ద్వారా
రాష్ట్రంలో కొన్నేళ్లుగా నడుస్తున్న 104 వ్యవస్థను జగనన్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్లకు అనుసంధానం చేవారని తెలిపారు. ప్రతీ నెలకు రెండు సార్లు చొప్పున ఆయా విలేజ్ క్లినిక్‌ల పరిధిలో మెబైల్ మెడికల్ యూనిట్ పర్యటిస్తుందని చెప్పారు. పర్యటన సమయంలో ఎంఎంయూలో మెడికల్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అందుకోసం ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 48 వేల నియామకాలను ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే జగనన్న నాలుగేళ్ల పరిపాలనా కాలంలో చేపట్టారని పేర్కొన్నారు. ఇది ఒక చరిత్ర అని స్పష్టంచేశారు. సమీపంలోని పీహెచ్‌సీలో నియమించిన ఇద్దరు డాక్టర్లలో ఒకరు ఈ ఎంఎంయూతో పాటుగా ఆయా విలేజ్ క్లినిక్ లలో వైద్య సేవలు అందిస్తారని వివరించారు.
15 రోజులకు ఒకసారి వెళ్లేలా.. ప్రతీ 15 రోజులకు ఒకసారి ప్రతి గ్రామానికి కనీసం ఇద్దరు వైద్యులు వెళ్లేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆయా గ్రామాలకు వెళ్లే వైద్యులు క్రమం తప్పకుండా అక్కడి రోగులను పరీక్షించి అవసరమైన మందులు అందిస్తారని పేర్కొన్నారు. రోగులు మంచం నుంచి కదలలేని స్థితిలో ఉంటే వైద్యులు నేరుగా వారి ఇళ్లకే వెళ్లి వైద్యం అందిస్తారని వెల్లడించారు. దానికే ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ అని పేరు పెట్టామని వివరించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో ఇప్పటికే ఏపీలోని దాదాపు 3.5 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించామని, ఈ విషయంంలో మన రాష్ట్రంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. ఈ డేటా ఆధారంగా విలేజ్ క్లినిక్ పరిధిలో ఎవరెవరు దీర్ఘకాల వ్యాధిగ్రస్థులున్నారన్నది ముందుగానే తెలిసిపోతుందని పేర్కొన్నారు. వారంతా 104 మొబైల్ మెడికల్ యూనిట్ గ్రామానికి రాగానే మందుల కోసం వచ్చేస్తారని, ఆ మేరకు ఆయా రోగులను ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది సన్నద్ధం చేస్తారని పేర్కొన్నారు. ఇంటికి వెళ్లి వైద్యం అందించాల్సిన అవసరం ఎవరికి ఉన్నది.. అనే విషయాలను కూడా వారే నిర్ణయిస్తారని తెలిపారు.
ఉచితంగా మందులు, టెస్టులు
విలేజ్ క్లినిక్‌లకు రోగులకు ఉచితంగా ఓపీ సేవలు అందించడం, ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం, మందులు ఇవ్వడం ఫ్యామిలీ డాక్టర్ విధి అని చెప్పారు. మరోవైపు అవసరమైన వారికి ఇంటికి వెళ్లి వైద్యం అందించడం ఈ నూతన కార్యక్రమంలో భాగమని వివరించారు. 2022 అక్టోబర్ నుంచి ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా అమలుచేశామని, సత్ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. 104 వాహనాల ద్వారా ఒక్కో సచివాలయాన్ని నెలకు 2 సార్లు ప్రభుత్వ వైద్యులు పర్యటిస్తారని. రోగులకు బీపీ, షుగర్ పరీక్షలు కూడా నిర్వహిస్తారని చెప్పారు. నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్‌గా పిలిచే అలాంటి సమస్యలే ఎక్కువ మందికి ఉన్నట్టు గుర్తించి, వారి ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించే వీలు ఫ్యామిలీ డాక్టర్ విధానం వల్ల చేకూరిందన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా 14 రకాల డయాగ్నోస్టిక్ ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు కిట్‌లు అందుబాటులో ఉంచామని తెలిపారు. బీపీ, షుగర్ వంటి పరీక్షలతో పాటు ఈసీజీ లాంటివి కూడా చేస్తామని పేర్కన్నారు. 67 రకాల మందులు కూడా అందుబాటులో ఉంటాయని, వాటిని పూర్తి ఉచితంగా రోగులకు అందజేస్తామని వెల్లడించారు. యూరప్ తరహాలో వైద్యం అందించే ఆలోచనతో ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించామని చెప్పారు.
అందుబాటులో వైద్యం
ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం వల్ల సాధారణ రోగులకు సైతం వైద్యం అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. అవసరమైన పరీక్షలు కూడా చేస్తారని పేర్కొన్నారు. విలేజ్ క్లినిక్‌ల నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. తద్వారా వారికి అవసరమైనప్పుడు ఏఎన్ఎంతో పాటుగా ఎంఎల్ హెచ్‌పీ సహాయంతో వారిని పీహెచ్‌సీకి రిఫర్ చేస్తారని తెలిపారు. అక్కడి నుంచి ఇంకా మెరుగైన వైద్యం అందాలంటే ఏరియా ఆస్పత్రికి, జిల్లా ఆస్పత్రికి పంపిస్తారని వివరించారు. ఇలా రిఫరల్ వ్యవస్థ ద్వారా వైద్యం నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో అందుతుందని వెల్లడించారు. గర్బిణులు, చిన్న పిల్లలు, శిశువులు, బాలింతలకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. డిజిటల్ హెల్త్ ఐడీ అందుబాటులో ఉంది కాబట్టి, ఎన్‌సీడీ డేటా ఆధారంగా మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశాలు ఏర్పడతాయని వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.