జిల్లావ్యాప్తంగా పింఛన్ల పండగ వాతావరణం నెలకొందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కడపలో మీడియాతో మాట్లాడారు.
హామీ ఇచ్చిన మాట ప్రకారం జూలై 1 నుంచి పెంచందర్లకు రూ.4,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లను ఐదు సంవత్సరాలు పని చేయించుకుని వారితో రాజీనామాలు చేయించి నట్టేట ముంచిందని ఆరోపించారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో రూ.179 కోట్ల పింఛన్ల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాలు త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ క్యాడర్ పాల్గొనేటట్టుగా అధికారులు సహకరించాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నగదు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాగా రాష్ట్రంలో ఫించన్లు పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కూటమి అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ. మూడు వేల నుంచి రూ.నాలుగు వేలకు పెంచుతామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఆ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ పెంపుపైనే చంద్రబాబు తొలిసంతకం చేశారు. జూలై ఒకటో తేదీన రూ.నాలుగు వేలతోపాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఎరియర్స్ రూ.మూడు వేలు కలిపి రూ.ఏడు వేలు అందజేయనున్నారు. ఈ మేరకు వార్డు సచివాలయ పరిధిలో ఎంతమందికి పెన్షన్ అందజేయాలి.. ఎంత మొత్తం అవసరమనే దానిపై అధికారులు ముందుగానే లెక్కలు సిద్ధం చేశారు.