Pawan Kalyan varahi yatra: వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ దూకుడు తగ్గడం లేదు. వైసీపీ, వాలంటీర్ల నుంచి నిరసనలు ఎదురవుతున్నా తగ్గేదే లేదంటున్నారు జనసేన చీఫ్. తాను అనుకున్నది, చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తున్నారు.
వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ దూకుడు తగ్గడం లేదు. వైసీపీ, వాలంటీర్ల నుంచి నిరసనలు ఎదురవుతున్నా తగ్గేదే లేదంటున్నారు జనసేన చీఫ్. తాను అనుకున్నది, చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తున్నారు. తాడేపల్లిగూడెం, తణుకులో పర్యటించిన పవన్… మరోసారి సీఎం జగన్, వాలంటీర్లపై హాట్ కామెంట్స్ చేశారు. ఉద్రిక్తతలు, ఆందోళనల మధ్య పవన్ వారాహి యాత్ర కొనసాగుతోంది. వాలంటీర్లపై హాట్ కామెంట్స్ చేయడంతో అడుగడుగునా నిరసన సెగ తగులుతోంది. ఇప్పటివరకూ ఆందోళనలన్నీ పవన్‌కి దూరంగా జరిగితే, తణుకు మాత్రంలో విచిత్ర అనుభవం ఎదురైంది జనసేన చీఫ్‌కి. వైసీపీ కార్యకర్తలు ఏకంగా పవన్ ర్యాలీకి అడ్డుగా వెళ్లి నిరసనతెలపడంతో తేతలి గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
తణుకులో ర్యాలీ తర్వాత వీర మహిళలతో సమావేశమైన పవన్.. సీఎం జగన్ టార్గెట్‌గా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇకపై తన కుటుంబం జోలికొస్తే అస్సలు ఊరుకోనంటూ హెచ్చరికలు పంపారు. అంతకుముందు, తాడేపల్లిగూడెంలో వాలంటీర్లపై మళ్లీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అదో ప్రైవేట్ ఆర్మీ అన్నారు. ప్రజలను, వనరులను దోచుకోవడానికి వైసీపీ పెట్టుకున్న సైన్యం అంటూ ఆరోపించారు.
జనసేన ఏ పార్టీకి B టీమ్ కాదని మరోసారి తేల్చిచెప్పారు పవన్. ఎవరైనా అలాగంటే ఎదురు తిరిగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మర్డర్ టీమ్ ఎవరిదో, క్రిమినల్స్ గుంపు ఏదో ప్రజలందరికీ తెలుసన్నారు జనసేన చీఫ్.
శ్రీకాళహస్తి సీఐ అంజుయాదవ్‌పై నిప్పులు చెరిగారు జనసేన అధినేత. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కొట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి వస్తున్నా, అక్కడే తేల్చుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్.
షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తారన్న ప్రచారంపై కీలక కామెంట్స్ చేశారు. ఒక పార్టీని నడపాలంటే వేలకోట్లు ఉంటే సరిపోదన్నారు. సైద్ధాంతిక బలం, బలమైన సంకల్పం ఉండాలన్నారు. అర్జెంట్‌గా అధికారంలోకి వచ్చేయాలనుకుంటే ఇలాగే ఉంటుందన్నారు పవన్.
ఒకవైపు హాట్‌హాట్‌గా పవన్ వారాహి టూర్ కొనసాగుతుంటే, ఇంకోవైపు వాలంటీర్ల నిరసనలు కొనసాగుతున్నాయ్!. విజయవాడలో ఓ వాలంటీర్ ఇచ్చిన కంప్లైంట్‌తో పవన్‌పై 153, 153A, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదైంది.