తెలంగాణ దంగల్ పరిసమాప్తమైంది. ఇక అధికార పగ్గాలు ఎవరికి చేతికి? ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరోవైపు ఏపీలో నూ పొలిటికల్ మూడ్ ఎన్నికల మోడ్‌లోకి మారుతోందా? బెజవాడ పొలిటికల్ సర్కిల్లో అలయెన్స్ ఫ్రేమ్‌పై చర్చజరుగుతోంది. పొత్తు మరింత సమన్వయ దిశలో సాగేలా టీడీపీ-జనసేన వ్యూహాలకు పదను పెడుతున్నాయా? చంద్రబాబు-పవన్ కల్యాణ్ మలివిడిత భేటీకి ఇవాళ విజయవాడ వేదికగా కానుందా? గతంలో సమావేశమైన ఆ ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించారు.. మళ్లీ ఇప్పుడు భేటీ అయితే అజెండా ఏంటీ?
మంగళగిరిలోజరిగిన జనసేన విస్తృతస్థాయిలో సమావేశంలో పవన్ కల్యాణ్ పొత్తు గురించి కీలక ప్రకటన చేశారు.. తిరుమల సందర్శనలో చంద్రబాబు దాని గురించే స్పందించారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఒకరికి మరొకరు అతిచేరువలో వున్నారు. ఇవాళ చంద్రబాబు దుర్గ గుడిని సందర్శిస్తారు. ప్రత్యక పూజలో పాల్గొంటారు. పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఉన్నారు కాబట్టీ.. బాబు-పవన్ ఇద్దరు భేటీ అవుతారా?…మేనిఫెస్టో సహా ఉమ్మడి కార్యచరణపై కీలక నిర్ణయాలు తీసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరి సమావేశంపై క్లారిటీ లేదు. కానీ ఒకవేళ సమావేశమైతే ఉమ్మడి మేనిఫెస్టోపై పూర్తిస్థాయిలో చర్చలు జరగే అవకాశం వుందనే టాక్ విన్పిస్తోంది. అలాగే పొత్తులో భాగంగా అభ్యర్థుల ఎంపిక, ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు, టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో ఆందోళనలు.. ఉమ్మడిగా బహిరంగ సభలునిర్వహించే అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం వుంది.
ఇప్పటికే ఏపీ పాలిటిక్స్ ఎలక్షన్ లైన్లోకి వచ్చేశాయి. అభివృద్ధి, సంక్షేమం పేరిట వైసీపీ బస్సు యాత్రలు.. వైసీపీ టార్గెట్‌గా టీడీపీ- జనసేన సమన్వయ ఆందోళనలతో ఏపీ రాజకీయం గరంగరంగా మారింది. రాజమండ్రి వేదికగా టీడీపీతో పొత్తును ఖరారు చేసిన పవన్ కల్యాణ్.. టీడీపీని పల్తెత్తు మాట అనొద్దని.. కలిసి నడవాలని మంగళగరిలో జనసైనికులకు దిశా నిర్దేశం చేశారు. కురుక్షేత్రానికి సిద్దంగా ఉండాలనే సంకేతాలిచ్చారు పవన్
ఇప్పటికే పొత్తులో భాగంగా సమన్వయ కమిటీలతో టీడీపీ-జనసేన కలిసి నడుస్తున్నాయి. మరోవైపు ఓట్ల జాబితాలో అక్రమాలపై టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది. రాష్ర్ట ఎన్నికల సంఘానికి అనేక సార్లు ఫిర్యాదు చేసింది. ఈ అంశాన్ని త్వరలో చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాల దృష్టికి తీసుకెళ్లే యోచనలో వున్నారు. ఈక్రమంలో విజయవాడ పర్యటనలో భాగంగా పవన్‌తో చంద్రబాబు భేటీ వుంటుందా? ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు సహా ఉమ్మడి మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక వంటి కీలక అంశాలపై ఇద్దరు చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం వుందని టీడీపీ, జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది.