మచిలీపట్నం నవంబర్ 21 ఆంధ్ర పత్రిక.
విట్టల విట్టల, పాండురంగా, పాండురంగా విఠల విట్టల, నామస్మరణతో నేటినుండి కార్తీక పౌర్ణమి 27వ తేదీ వరకు చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపబోతున్నారు. కార్తిక ఏకాదశి నాడు, కార్తీక పౌర్ణమి నాడు పాండురంగడిని ,లక్ష మంది పైగా భక్తులు దర్శించుకుంటారని దేవాలయ నిర్వాహకులు టేకి నరసింహం తెలిపారు.
ఇప్పటికే దేవాలయ ప్రాంగణంలో వివిధ రకాల దుకాణాలు, చిరు వ్యాపార కేంద్రాలు, దేవతా మూర్తుల విగ్రహాలతో బొమ్మల దుకాణాలు, ఫాన్సీ దుకాణాలు, వెలిశాయి. దేవాలయ ప్రాంగణం ఒక తీర్థాన్ని మైమరపించేలా తీర్చిదిద్దారు. దేవాలయం అంతా విద్యుత్ కాంతులతో దగద్దాయమానంగా శోబిల్లుతోంది.
కరోనా అనంతరం పరిస్థితులు చక్కబడటం వల్ల ఈ సంవత్సరం చిలకలపూడి పాండురంగడి దర్శనానికి , మంగినపూడి సముద్ర స్నానాలకు, భక్తులు లక్షలాదిగా తరలి వస్తారని జిల్లా అధికారులు అంచనా వేశారు. ఆర్టీసీ అధికారులు కార్తీక పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా చిలకలపూడి మంగినపూడి ప్రాంతాలకు బస్సులను ఏర్పాటు చేశారు. దానికి తగ్గట్లుగా పటిష్ట మైన భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతోంది.పోలీస్ శాఖ కూడా ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది.
పాండురంగడు దర్శనానికి విచ్చేసే భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ నిర్వాహకులు టేకి నరసింహ మీడియాకి తెలిపారు.
మన రాష్ట్రం నుండే గాక తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు అశేష సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
మాజీ మంత్రి బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) యువజన నాయకులు పేర్ని కిట్టు, నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ , అధికారులు, కార్పొరేటర్లు, పాండురంగడుకి ప్రథమ పూజలు అందిస్తారు.
కోరిన కోర్కెలు తీర్చే పాండురంగడిని, ఈ సంవత్సరం కార్తీక దశమి నుండి కార్తీక పౌర్ణమి వరకు జరిపే ఉత్సవాల్లో భక్తులు అశేషంగా దర్శిస్తారని అంచనా.
ఇప్పటికే దేవాలయం విఠలా, విఠలా, పాండురంగ విట్టల పండరినాధ విట్టల అనే నామస్మరణతో మారుమోగిపోతుంది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ ని జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. చిలకలపూడి పాండురంగడి దర్శనానికి విచ్చేసే భక్తులకు, మంగినపూడి సముద్ర స్నానాలకు విచ్చేసే భక్తులకు, ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని, జిల్లా అధికారులను, బందరు మండల అధికారులను, పోలీస్ శాఖను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
ఆలయ పరిసరాలు, సముద్రతీర పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడికి అక్కడ బ్లీచింగ్ చల్లించాలని, మురుగునీరు, చెత్త చెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నగరపాలక పారిశుద్ధ్య సిబ్బందిని అప్రమత్తంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కి తెలియజేశారు.