వైకాపా అరాచక శక్తులకు సహకరిస్తున్న ఎస్పీ
ఘటన తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్న ఎస్పీ
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి,డిసెంబరు 18 (ఆంధ్రపత్రిక): పల్నాడు ఎస్పీ రవిశంకర్ తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాచర్లలో వైకాపా అరాచక శక్తులకు ఎస్పీ సహకరిస్తున్నారని ఆరోపించారు.అతడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పల్నాడు ఎస్పీ స్థానంలో హోంగార్డును కూర్చోబెట్టినా సమర్థంగా పని చేస్తారని ఎద్దేవా చేశారు. ఇలాంటి అధికారులతో పోలీసు విభాగానికే తలవొంపులని ఆవేదన వ్యక్తం చేశారు.మాచర్ల ఘటనపై శనివారం ఎస్పీ రవిశంకర్ స్పందిస్తూ.. మాచర్లలో జరిగినవి చిన్న చిన్న ఘటనలేనని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘గతంలో ఫ్యాక్షన్ చరిత్ర కలిగినవారు, హత్యలు, కిరాయిహత్యలు చేసినవారు ఉన్నారనే సమాచారంతో శుక్రవారం మాచర్లలోని 7వ వార్డులో (తెదేపా నేత బ్రహ్మారెడ్డి నివాస ప్రాంతం) నిర్బంధ తనిఖీలు (కార్డన్ సెర్చ్) చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. శుక్రవారం సాయంత్రం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అన్న కార్యక్రమాన్ని కొందరు నిర్వహించారని, అందులో ఫ్యాక్షనిజంతో సంబంధమున్న వారు పాల్గొన్నారని చెప్పారు.ఈ క్రమంలో రెండువర్గాలు ఎదురుపడి పరస్పరం రెచ్చగొట్టేలా మాట్లాడుకోవడం గొడవలకు దారితీసింది’’ అని ఎస్పీ తెలిపారు. దీనిపై తెదేపా వర్గాలు భగ్గుమంటున్నాయి. ఘటన తీవ్రతను ఎస్పీ తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డాయి.