కె.కోటపాడు,ఫిబ్రవరి 21(ఆంధ్రపత్రిక):
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధిష్టానం అభ్యర్థికిప్రచారం, ఎన్నికల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలో తననూ నియమించిందని టీడీపీ మాడుగుల నియోజకవర్గం నాయకులు పైలా ప్రసాదరావు చెప్పారు.ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా టిడిపి తరుపున పోటీ చేస్తున్న డాక్టరు వేపాడ చిరంజీవి రావు గెలుపునకు ఆరుగురు నేతలతో కమిటీని నియమించిందన్నారు. కమిటీలో మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ మూర్తి, కొండ్రు మురళి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపు రెడ్డి జగదీశ్, ఎ.ఎస్.రామకృష్ణలతో పాటు తనూ ఉన్నానన్నారు. ఆరు జిల్లాల పరిధిలో సీనియర్ నేతలను, ఇంచార్జిలను, నాయకులను సమన్వయపరుస్తూ టిడిపి ఎమ్మెల్సీ స్థానం విజయమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. ప్రచార సరళిని గమనిస్తూ ఉత్తరాంధ్ర నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాన్ని క్రియాశీలకం చేయడం వంటి బాధ్యతలను ఈ కమిటీకి అప్పగించారని ఆయన తెలిపారు. అధిష్టానం అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంలో చిత్తశుద్ధితో పని చేస్తానని, టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్ధి వేపాడ చిరంజీవి రావు గెలుపునకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రసాదరావు చెప్పారు.