- విశాఖ ఘటనపై జనసేనాని వీడియో విడుదల
- 115 మంది జనసేసైనికులపై పోలీసులు కేసు
- న్యాయపోరాటం చేసేందుకు సిద్దమైన పవన్
- తన పోరాటం ప్రభుత్వంతో తప్ప పోలీసులతో కాదు
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి న్యాయ పోరాటం
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్
విజయవాడ,అక్టోబర్ 17 (ఆంధ్రపత్రిక): విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన సంఘటనపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సోమవారం వీడియో విడుదల చేశారు. 115 మంది జనసేన నాయకులపై పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టారని, కొంతమందికి స్టేషన్ బెయిల్ రాగా, 12మందిని రిమాండుకు పంపారన్నారు. మంగళవారం హైకోర్టులో పిటిషన్ వేసి వారిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. తమ పోరాటం వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపైనే అని స్పష్టం చేశారు. పోలీసులతో తమకు ఎటువంటి విబేధాలు లేవన్నారు. ఈ గొడవంతా ప్రభుత్వం వల్లేనని.. పోలీసుల నుంచి కాదన్నారు. తన కోసం వచ్చిన అభిమానులకు కూడా అభివాదం చేయకుండా అడ్డుకున్నారని, ప్రభుత్వం అడ్డంకుల వల్ల అభిమానులను కలవలేక పోయానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాగా విశాఖపట్నంలో పోలీసులు జనసేన నేతలు, కార్యకర్తలను అడ్డుకుని అక్రమ అరెస్టులు చేసి.. హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి పయనమైయ్యారు. విశాఖలో ప్రజలకు కనీసం అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇటువంటి ఆంక్షలే భవిష్యత్తులో విధించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేయడానికి న్యాయ నిపుణులతో పవన్ చర్చలు జరప నున్నారు. విశాఖపట్నంలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మొత్తం 115 మందిపై అక్రమ అరెస్టుల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ న్యాయ పోరాటానికి దిగుతున్నట్లు సమాచారం. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు బనాయించి, అరెస్టులు చేశారని పవన్ మండిపడ్డారు. ప్రజలకు అభివాదం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీస్ ఆంక్షలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పోరాటం ప్రభుత్వంతో తప్ప పోలీసులతో కాదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. జగన్ సర్కార్‌ను నియంత్రించేందుకు న్యాయ పోరాటం చేస్తామని పవన్ తెలిపారు.