మచిలీపట్నం సెప్టెంబర్ 30 ఆంధ్ర పత్రిక.:
వయోవృద్ధులు మన కంటి వెలుగులని ఇంటి దీపాలని, అలాంటి వృద్ధుల్ని గౌరవించడం మన సంస్కారం అని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది లంకి శెట్టి బాలాజీ అన్నారు . వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఈడేపల్లి జెట్టి ప్రభుత్వ వృద్ధ శరణాలయంలో వయో వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ వయోవృద్ధులు మన జాతి సిరిసంపదలని అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రేమించాలని ,వారి ఆశీర్వాద బలాలే మనకు శ్రీరామరక్ష అని అన్నారు. రాబోయే రోజుల్లో వృద్ధాశ్రమాలు లేకుండా చూడవలసిన బాధ్యత నేటి యువతరం పై ఉందన్నారు. నేటి యువత ఉద్యోగాలు ,డబ్బుల వేటలో పడి తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తున్నారని, అది మంచిపద్దతి కాదని అన్నారు. వెలుగు ఫౌండేషన్ సంస్థ, బెరాకా మినిస్ట్రీస్ సంస్థ సహకారంతో 30,000 రూపాయలు ఖరీదు చేసే రగ్గులను, వృద్ధులకు అందజేయడం అభినందనీయమన్నారు.
మరో ఆత్మీయ అతిధి మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ టి. పెద్దిరాజులు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించాలని వారి ఒంటరితనానికి నేనున్నాను , అనే భరోసా కల్పించాలని అన్నారు. వృద్ధులు, పసిపిల్లలు ఒక్కటేనని బాల్యంలో అమ్మ కంటికి రెప్పలాగా బిడ్డల్ని ఎలా చూసుకుంటుందో, అలాగే వృద్ధాప్యం వచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా వారి బిడ్డలు కంటికి రెప్పలా కాపాడుకోవడం కనీస ధర్మమని అన్నారు. ఈ జగమంతా పోనీ, యవ్వనమంతా పోనీ, ఈనాటి ఈ జీవితం అంతా పోనీ, ఆనాటి బాల్యాన్ని ఒకసారి రాని అని ప్రముఖ కవి అద్దేపల్లి అన్నారని, అలాగే ప్రతి ఒక్కరూ బాల్యంలో జరిగిన మధురస్మృతులను తలుచుకుంటారని , దానికి తగ్గట్టుగా వృద్ధులను కూడా పసిపిల్లల వలే సాకవలసిన బాధ్యత మన భుజస్కందాలపై ఉందని పెద్దిరాజులు అన్నారు. బెరాకా మినిస్ట్రీస్ సహకారంతో, వెలుగు ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం అని అన్నారు.
బెరాకా మినిస్ట్రీస్ సంస్థ అధినేత డాక్టర్ బి. ఎస్. కిరణ్ పాల్ మాట్లాడుతూ వృద్ధులు ఎప్పుడూ ఒంటరిగా ఉండవద్దని తమ శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా, స్నేహపూర్వకంగా గడపాలని అన్నారు. వృద్ధుల జీవితానికి భద్రత , అందించడానికి తమ సంస్థ ద్వారా చేతనయినంతగా సాయం అందించడానికి అవిరళ కృషి చేస్తామని కిరణ్ పాల్ అన్నారు. ఇప్పటికే బాలబాలికలకు అనాధ శరణాలయాలు ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం తమ బెరాకా సంస్థ ద్వారా, వారి విద్యకు సహకారం అందిస్తున్నామని, ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. తమ సంస్థ లో విద్య గడించిన తమ విద్యార్థులు కూడా ఉన్నత ఉద్యోగాలు చేస్తూ పేదలకు, వృద్ధులకు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. ఆపద లో ఉన్న వారికి చేయూతను అందించడమే తమ సంస్థ ఆశయం అని కిరణ్ పాల్ అన్నారు. విలువలతో కూడిన విద్యను అందించడమే తమ సంస్థ లక్ష్యమని అన్నారు. తమ సంస్థ తరఫున ఎల్లప్పుడూ వృద్ధులకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వృద్ధులకు భరోసా కల్పించాలని అన్నారు. వెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు చందమామ బాబు అడిగిన వెంటనే తమ సంస్థ తరఫున ఈ చిరు సాయం అందించడం జరిగిందన్నారు. వయోవృద్ధుల కోసం దాతలు ముందుకు వచ్చి వారి సహాయ సహకారాలు అందించాలని చందమామ బాబు కోరారు. సహాయ ఫౌండేషన్ కార్యదర్శి కంచర్లపల్లి కృష్ణమోహన్ వృద్ధులకు మనోధైర్యం కల్పిస్తూ కవిత చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు కారుమూరి రాజేంద్రప్రసాద్, ఫాదర్ డానియల్, ఫాదర్ రాజేష్, వెలుగు ఫౌండేషన్ సభ్యులు విశ్రాంతి ఉపాధ్యాయులు వసంతరావు, మహమ్మద్ బేగం, ప్రభుత్వ వృద్ధాశ్రమ సిబ్బంది పాల్గొన్నారు. తొంబై ఎనిమిది సంవత్సరాల వయసు గల వయోవృద్ధుడు రంగయ్యతో కేక్ కట్ చేయించి వారితో అతిథులు ఆనందం పంచుకున్నారు. వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ రగ్గులతోపాటు, బిస్కెట్ ప్యాకెట్లు, పళ్ళు పంపిణీ చేశారు. ఒక్కసారిగా ఆత్మీయులుగా, అతిధులు వచ్చి అక్కున చేర్చుకునే సరికి వృద్ధులు ఉబ్బితబ్బిబ్బు అయిపోయారు.