త్వరలో ఏ పార్టీలోకి వెళ్ళేది తెలియజేస్తా
కాకినాడ, ఏప్రిల్ 4: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి, పార్టీ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్టు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన నులుకుర్తి వెంకటేశ్వరరావు తెలిపారు. తాను సుమారు 26ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిలలో పనిచేస్తూ నేటితో ఆ పార్టీతో ఉన్న బంధంను తెంచుకుంటున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన కాకినాడలోని ఓ హోటల్లో తన రాజీనామాకు సంబంధించిన విషయాలను వెంకటేశ్వరరావు వెల్లడించారు.
ఈ సందర్భంగా నులుకుర్తి మాట్లాడుతూ 1998లో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. అప్పటినుంచి తాను కాంగ్రెస్ పార్టీలో అంచలంచెలుగా ఉన్నత పదవులలో చేసినట్లు చెప్పారు. 2001లో కాకినాడ రూరల్, 2006లో పెదపూడి నుండి జడ్పిటిసిగా రెండు మార్లు గెలుపొందినట్లు చెప్పారు. అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం కొద్దిలో చేజారినట్లు తెలిపారు. 2009, 2019లో కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని కొద్దిగ ఓట్ల తేడాతో ఓటమి చెందానన్నారు. అప్పటినుంచి పార్టీలో పని చేశానని రాష్ట్రంలో వైకాపా, టీడీపీ, జనసేన వంటి ప్రాంతీయ పార్టీల ప్రభావం వల్ల కాంగ్రెస్లో ఉండి తనను నమ్ముకున్న పార్టీకి, కార్యకర్తలకు ఎటువంటి పనులు చేయలేనని గ్రహించడం వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుకు పంపించానని తెలిపారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. సుమారు ఈ 26 ఏళ్ల కాలంలో సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలను నులుకుర్తి వెంకటేశ్వరరావు తెలిపారు.