ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ .. రాజకీయాలు మాత్రం ఆయన్ను వదలడం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తరువాత పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలనే డిమాండ్ వినిపించింది.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేతలు సైతం చంద్రబాబు పార్టీ అధ్యక్షడుగా తప్పుకుని జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి బాధ్యతలు ఇవ్వాలని సలహా ఇచ్చారు.
చంద్రబాబు మాత్రం నారా లోకేష్ పార్టీకి భవిష్యత్తు నాయకుడు అని తేల్చేశారు. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంది. ఇటీవల టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి అభిమానులు పాలాభిషేకం చేయడం సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లాలో సైతం టీడీపీ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకం చేశారు. అభిమానులు అక్కడితో ఆగకుండా టీడీపీ నేతల ముందే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.
ఇక గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్ అభిమానులు భారీగా హాజరైయ్యారు. కొడాలి నానికి మద్దతుగా ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అభిమానులు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, ఫొటోలతో కూడిన జెండాలతో కొడాలి నాని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా సీఎం జగన్ సభలో కూడా ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. కర్నూల్ బహిరంగ సభలో పాల్గొన్న జగన్ అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ బహిరంగ సభలో ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫొటో ఉన్న జెండాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభాస్ అభిమానుల సైతం సీఎం సభలో సందడి చేశారు. జగన్, ప్రభాస్ ఫొటోలతో కూడిన జెండాలతో సభకు వచ్చి వైసీపీకి మద్దతుగా నిలిచారు. మెజార్టీ ఎన్టీఆర్ అభిమానులు వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. 2009 ఎన్నికల సమయంలో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రచారం కూడా నిర్వహించారాయన. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు.
కాకపోతే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడం.. ఆ తరువాత టీడీపీలో చోటు చేసుకున్న అంతర్గత కలహాలతో ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఆయనపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన కెరీర్ మీదనే దృష్టిని సారించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే సినిమాలో నటిస్తున్నారు.