కాంగ్రెస్ సంస్థకు చైనా నుంచి డబ్బులు!
కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు
న్యూఢల్లీి, డిసెంబర్ 13 : కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ దగ్గర డిసెంబర్ 9,2022 భారత్- చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశం ఇవాళ పార్లమెంట్ లో హాట్ టాపిక్ గా మారింది.ఈ క్రమంలోనే కేంద్రంలోని అధికార బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ లోక్‌సభలో ప్రకటన చేసి, వివరణ ఇచ్చారు. ఆ వెంటనే విపక్ష పార్టీల నేతలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో భారతదేశంలో ఒక్క అంగుళం భూమిని కూడా కబ్జా కాలేదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏ ఒక్కరూ భారత్ లో అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదని అన్నారు. అసలు కాంగ్రెస్ నిరసనకు మరో కారణం ఉందని అమిత్ షా ఆరోపించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌పై ఒక ప్రశ్న జాబితా చేయబడినప్పటీ నుంచి కాంగ్రెస్ ఎంపీలు ఉద్దేశపూర్వకంగా లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని అంతరాయం కలిగించారని అన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ యొక్క ఎఫ్సిఆర్ఎ రద్దుపై ప్రశ్నను నివారించడానికి కాంగ్రెస్ పార్లమెంటులో సరిహద్దు సమస్యను లేవనెత్తిందని విమర్శించారు. ‘‘ భారత్- చైనా బలగాల మధ్య ఘర్షణ అంశంపై రక్షణ మంత్రి (రాజ్‌నాథ్ సింగ్) ప్రకటన చేస్తారని చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ దురదృష్టవశాత్తూ ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకుంది. నేను ప్రశ్నోత్తరాల జాబితాను చూశాను. ప్రశ్న సంఖ్య 5ని చూసిన తర్వాత (కాంగ్రెస్) ఆందోళనను అర్థం చేసుకున్నాను. ఓ కాంగ్రెస్ సభ్యుడు ప్రశ్నించారు.. మేము సమాధానం సిద్ధంగా ఉంచాము.. అయినా సభకు అంతరాయం కలిగించారు. వారు అనుమతిస్తే, 2005-06, 2006-07 మధ్య కాలంలో సోనియాగాంధీ చైర్మన్ గా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా రాయబార కార్యాలయం నుండి రూ.1.35 కోట్ల గ్రాంట్ పొందింది. ఇది ప్రకారం సరికాదని నేను పార్లమెంటులో సమాధానం ఇచ్చి ఉండేవాడిని. కాబట్టి నిబంధనల ప్రకారం, హోం మంత్రిత్వ శాఖ రెండు నెలల క్రితం ఆ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది’’అని షా అన్నారు. చైనాపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరితో ఉందన్నారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు చైనాపై ఉన్న ప్రేమ వల్లనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం దక్కకుండా పోయిందని అమిత్ షా అన్నారు. 1962లో చైనా వేల హెక్టార్ల భారత్ భూభాగాన్ని లాక్కుందని అన్నారు. తవాంగ్ సెక్టార్ ఘటనను ప్రస్తవిస్తూ.. భారత సైనికులు కొద్దిసేపటికే చైనా సైనికులను తరిమికొట్టారని,భారతదేశంలోని ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించబడలేదన్నారు. డిసెంబర్ 8-9 మధ్య రాత్రి అరుణాచల్ ప్రదేశ్‌లో మన భారత ఆర్మీ దళాలు చూపిన పరాక్రమానికి నేను వందనం చేస్తున్నాను అని అమిత్ షా అన్నారు.