- కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తున్నా
- పెట్టుబడులను తిరస్కరించటం సరైంది కాదు
- రాజస్థాన్‌లో ఆదానీ పెట్టుబడులపై రాహుల్ స్పందన
మాండ్యా,అక్టోబర్ 8 (ఆంధ్రపత్రిక): దాను కార్పోరేట్లకు వ్యతిరేకం కాదని, కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తున్నానని రాజస్థాన్‌లో ఆదానీ పెట్టుబడులపై రాహుల్ స్పందించారు. బిజెపి కొందరికే కేటాయింపులు చేయడాన్ని ఇప్పటికీ వ్యతిరేకిస్తానని అన్నారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రశంసించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను కార్పొరేట్లకు వ్యతిరేకం కాదని, కేవలం గుత్తాధిపత్యానికి మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. అదానీ రాజస్థాన్‌లో రూ.60,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని, దీనిని తిరస్కరించడం ఏ ముఖ్యమంత్రికైనా తగినది కాదని చెప్పారు. రాహుల్ గాంధీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే సమయంలో అదానీ`అంబానీలను లక్ష్యంగా చేసుకుంటుండటం తెలిసిందే. అటువంటి సమయంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఆ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన గౌతమ్ అదానీని ప్రశంసించారు. దీంతో గెహ్లాట్‌ను చాలా మంది విమర్శించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ శనివారం భారత్ జోడో యాత్ర సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆదానీపై గెహ్లాట్ ప్రశంసల గురించి స్పందించాలని ఓ విలేకరి కోరినపుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తాను కార్పొరేట్లకు వ్యతిరేకం కాదని, కేవలం గుత్తాధిపత్యానికి మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. అదానీ రాజస్థాన్‌లో రూ.60,000 కోట్లు పెట్టుబడులు పెడతానని చెప్పారన్నారు. ఇలాంటి ఆఫర్‌ను ఏ ముఖ్యమంత్రి అయినా తిరస్కరించజాలరని తెలిపారు. నిజానికి ఇలాంటి ఆఫర్‌ను తిరస్కరించడం ఏ ముఖ్యమంత్రికీ సరైనది కాదన్నారు. విలేకరి ఈ ప్రశ్న వేసినపుడు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వారించారు. కేవలం భారత్ జోడో యాత్ర గురించి మాత్రమే ప్రశ్నించాలని కోరారు. అయితే రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కాబట్టి తాను ఈ ప్రశ్నకు ఇంగ్లిష్‌లో సమాధానం చెబుతానన్నారు. నిర్దిష్టంగా కొన్ని వ్యాపార సంస్థలకు సహాయపడటం కోసం రాజకీయ అధికారాన్ని ఉపయోగించడాన్నే తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. రెండు లేదా మూడు లేదా నాలుగు పెద్ద వ్యాపార సంస్థలు దేశంలోని ప్రతి వ్యాపారంపైనా గుత్తాధిపత్యం సాధించడానికి రాజకీయంగా సహాయపడటానికే తాను వ్యతిరేకమని చెప్పారు. కార్పొరేట్లు, వ్యాపార సంస్థలకు తాను ఏ విధంగానూ వ్యతిరేకం కాదని, అయితే వ్యాపారాలపై గుత్తాధిపత్యం సాధించడానికే తాను వ్యతిరేకమని, కొన్ని సంస్థలు గుత్తాధిపత్యం సాధిస్తే, దేశం బలహీనపడుతుందని చెప్పారు.రాజస్థాన్‌లో అదానీ గ్రూప్‌నకు సహాయపడేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ అధికారాన్ని ఉపయోగిం చలేదని, ఒకవేళ అలా చేసిననాడు తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. ఆదానీ గ్రూప్ రాజస్థాన్‌లో రూ.65,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతోందని ఆ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తెలిపారు. దీనివల్ల 40,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్ళ నుంచి ఏడేళ్ళలో 10,000 మెగా వాట్ల సౌర విద్యుదుత్పాదన కర్మాగారం, సిమెంట్ ప్లాంట్ విస్తరణ, జైపూర్ విమానాశ్రయం ఆధునికీకరణ వంటి ప్రాజెక్టులను చేపడతామన్నారు. ఈ వివరాలను ’ఇన్వెస్ట్ రాజస్థాన్, 2022’ సదస్సులో ఈ నెల 7న ప్రకటించారు. ఈ సందర్భంగా అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, అదానీని ’గౌతమ్ భాయ్’ అని సంబోధించారు. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానాన్ని ఆక్రమించినందుకు అభినందించారు.