విజయవాడ,అక్టోబర్ 2 (ఆంధ్రపత్రిక): గాంధీజీ అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారని, ఈ నూతన ప్రయో గం అనాడు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మహాత్మాగాంధీ 153వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 118వ జయంతి సందర్భంగా ఆదివా రం విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాల్లో జరిగిన ప్రత్కేక కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మహానేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ వంటి చాలా మంది నాయకులు మహాత్మా గాంధీ అభిప్రాయాలతో అనాడు విభేదించి, బ్రిటిష్ వంటి శక్తివంతమైన దేశాన్ని అహింసతో తరిమికొట్టడం సాధ్యం కాదని భావించారని, అయితే అహింస అనే ఆయుధంతో స్వాతంత్య్రం సాధించడం సాధ్యమని మహాత్మా గాంధీ నిరూపించారని వివరించారు.
1942లో మహాత్మా గాంధీ భారతదేశాన్ని విడిచిపెట్టాలని బ్రిటిష్ వారికి తుది పిలుపు ఇచ్చినప్పుడు, చాలా మంది ప్రజలు ఆశ్చర్యపోయారని, శక్తివంతమైన బ్రిటిష్ పాలకులపై మహాత్ముని పిలుపు ప్రభావం చూపుతుందని నమ్మలేదని గవర్నర్ అన్నారు. అయితే హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి తూటాలకు లొంగకుండా ఉద్యమంలో పాల్గొని చివరకు దేశాన్ని స్వాతంత్య్రం దిశగా నడిపించారని హరిచందన్ పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఇతర దేశాల నాయకులు, మహాత్మా గాంధీ అహింసా విధానాలకు ప్రభావితమై వారి ఉద్యమాలలోనూ దానినే అనుసరించారన్నారు. గాంధీజీని ప్రపంచవ్యాప్తంగా ఆరాధిస్తారని ఆయన జయంతిని విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తున్నారని అన్నారు.
118వ జయంతి జరుపుకుంటున్న మరో మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి వినయశీలి, మృదుస్వభావి అయినప్పటికీ బలమైన నాయకుడన్నారు. ‘‘జై జవాన్ జై కిసాన్’’ అనే పిలుపునిచ్చి సరిహద్దులను కాపాడాలని జవాన్లకు, సంక్షోభ సమయంలో దేశానికి అవసరమైన ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలని రైతులకు లాల్ బహదూర్ శాస్త్రి పిలుపునిచ్చారన్నారు. 1965 నాటి యుద్ధం మొత్తం దేశానికి స్ఫూర్తినిచ్చిందని, ఇది యుద్ధంలో విజయం సాధనకు, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి తోడ్పడిరదన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.