తయారీ సంస్థలు తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని కోరుకుంటాయి. అందుకు అనువుగానే ఉత్పత్తులను తయారుచేస్తాయి. అయితే హార్డ్‌వేర్ కారణాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల కంపెనీ లేదా వినియోగదారులు ఊహించిన విధంగా ఆయా ఉత్పత్తులు పనిచేయవు.
దాంతో ప్రధానంగా వాటిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి తిరిగి వాటిని వినియోగదారులకు అందిస్తారు.
తాజాగా నిస్సాన్ కంపెనీ తయారుచేసిన మ్యాగ్నైట్ మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 2020 నుంచి డిసెంబర్ 2023 మధ్య తయారైన ఈ మోడళ్లలో ముందు డోరు హ్యాండిల్ సెన్సార్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఎన్ని యూనిట్లను రీకాల్ చేస్తున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. కానీ, గతేడాది డిసెంబర్ తర్వాత తయారైన మోడళ్లలో ఈ సమస్య లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని తమ కస్టమర్లకు చేరవేశామని కంపెనీ చెప్పింది. కంపెనీ గుర్తింపు పొందిన సర్వీస్ కేంద్రాల్లో ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని సంస్థ పేర్కొంది.