Botcha Satyanarayana: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది.
తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. ధీమాగా ఉంటోన్నాయి. ఆ ధీమాతోనే ఆయా పార్టీల అధినేతలు విదేశీ పర్యటనల్లో ఉంటోన్నారు.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి దాడులు సంభవించనివ్వకుండా ఏర్పాట్లు చేస్తోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రత్యేకించి- మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం తెర మీదికి వచ్చిన తరువాత పల్నాడు జిల్లా రాజకీయలు వేడెక్కాయి. ఆ జిల్లా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఈ వ్యవహారంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులే సస్పెండయ్యారని, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. రాజకీయ దాడులు, అల్లర్లకు ప్రధాన కారకుడు చంద్రబాబే అనేది అందరికీ తెలిసిన విషయేనని గుర్తు చేశారు.
పల్నాడులో మొత్తంలో తొమ్మిది చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేస్తే ఈసీ మాత్రం ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెందిన వెబ్‌కాస్టింగ్ వీడియోనే లీక్ చేయడం.. అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. మిగిలిన వాటి గురించి ఎన్నికల కమిషన్‌కు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. దీన్ని బట్టి చూస్తోంటే ఎన్నికల కమిషన్ ఎవరికి వత్తాసు పలుకుతోందో తెలిసిపోతోందని అన్నారు.
విజయనగరం జిల్లాను తాము స్వీప్ చేయబోతోన్నామని బొత్స ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదికి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంటామని వ్యాఖ్యానించారు. దళారులు లేకుండా సంక్షేమ పథకాల లబ్దిని నేరుగా ప్రజలకు అందించగలిగామని, పారదర్శక పరిపాలన అందించాని చెప్పారు.
ఆ నమ్మకంతోనే లోక్‌సభతో పాటు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుస్తామనే ఆత్మవిశ్వాసం తమకు ఉందని బొత్స చెప్పారు. తాము అంచనా వేసినదానికంటే రెండు శాతం అధికంగా ఓటింగ్ నమోదైందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ అభ్యర్థులపై ప్రజల్లో విశ్వసనీయత ఉందని చెప్పారు.