హైదరాబాద్, మే 4 : అనాథల కోసం బ్రిటిష్ మహారాణి క్వీన్ విక్టోరియా పేరిట ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ సరూర్‌నగర్‌లో ఏర్పాటుచేసిన రెసిడెన్షియల్ హోమ్‌లో ఇప్పుడు ఓ నయా క్వీన్ పాగా వేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దినసరి కూలీగా చేరి, ఆపై ఫేక్ సర్టిఫికెట్లతో రెగ్యులరైజేషన్ పొంది 34 ఏండ్లుగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తూ వందల కోట్లకు ఎదిగారని ఆరోపణలు వినవస్తున్నాయి.
హోమ్‌లోని నిజాం కాలం నాటి విలువైన సామగ్రిని దొంగచాటుగా ఖతం పట్టిస్తున్నారని సమాచారం. రెగ్యులర్ సిబ్బంది రాకుండా అడ్డుకుంటూ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది అండగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సదరు హోమ్ పూర్వ విద్యార్థులే ఆరోపిస్తున్నారు. హోమ్‌లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సాంఘిక సంక్షేమశాఖ ఉన్నతాధికారులను కలిసి మొరపెట్టుకున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ హోమ్ కథ
ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ తన కోసం 1901లో ఒక ప్యాలెస్‌ను నిర్మించుకుని భార్యకు కానుకగా ఇచ్చారు. అయితే అదే సంవత్సరం బ్రిటిష్ మహారాణి క్వీన్ విక్టోరియా టైఫాయిడ్ జ్వరంతో మరణించగా, 1903 జనవరి 1న ఈ భవనానికి విక్టోరియా పేరు పెడుతూ అనాథ పిల్లల విద్యాలయంగా మార్చారు. ఆ సూల్ నిర్వహణకు ఒక ట్రస్టు ఏర్పాటు చేశారు.
1953లో అప్పటి ప్రధాని నెహ్రూ ఈ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు ‘అనాథాశ్రమం’ పదాన్ని ‘హోమ్’గా మార్చాలని సూచించారు. నాటి నుంచి దీనిని విక్టోరియా మెమోరియల్ రెసిడెంట్ హోమ్‌గా పిలుస్తున్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దీనిని ఎయిడెడ్ పాఠశాలగా మార్చింది. 1994లో ఈ సూల్ను సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. డే సాలర్గా ఉండే విధానాన్ని రెడిడెన్షియల్గా మార్చారు.
ప్రశ్నిసే బదిలీ..
సూపరింటెండెంట్ తన అక్రమాలు ఎకడ బయటపడతాయోనన్న భయంతో రెగ్యులర్ ఉద్యోగుల నియామకం జరుగకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారని పూర్వ విద్యార్థులు ఆరోపించారు. హోమ్‌లో 950 మంది వరకు విద్యార్థులు ఉండగా, నలుగురు మాత్రమే రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు. మిగతా 70 మంది పార్ట్‌టైమ్, ఔట్సోర్సింగ్ సిబ్బందేనని వివరిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు ఎవరైనా ఎదిరిస్తే చాలు తన భర్తకు ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని బదిలీ చేయిస్తారని, మాటవినని ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తున్నారని తెలిపారు.
సీఎంవోకు పూర్వవిద్యార్థుల ఫిర్యాదు
సూపరింటెండెంట్ ఆగడాలను, అక్రమాలను చూడలేక విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ సూల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయంలో, సాంఘిక సంక్షేమశాఖ సెక్రటరీకి ఫిర్యాదు చేసింది. దాదాపు నెల క్రితమే ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయిందని పూర్వవిద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
అవగాహన లేని ఆరోపణలు : సూపరింటెండెంట్
పూర్వ విద్యార్థులు చేస్తున్న ఆరోపణలు, ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదు అవగాహన రాహిత్యంతో చేస్తున్నవే. అక్రమాలకు పాల్పడడానికి నాకేమీ చెక్‌పవర్ లేదు. నాపైన ప్రిన్సిపాల్, డీడీ, ఉంటారు. స్కూల్ఎస్టాబ్లిష్మెంట్, విద్యార్థుల బాగోగులు, హోమ్భూములను నేను చూసాను. మరోవైపు విక్టోరియా మెమోరియల్ హోం రెసిడెన్షియల్ స్కూల్ సూపరింటెండెంట్ లక్ష్మీపార్వతికి సంబంధించి పూర్వ విద్యార్థులు చేస్తున్న ఆరోపణలు నా దృష్టికి రాలేదని వీఎమ్ హోం హానరీ సెక్రటరీ కిషన్ చెప్పారు.
దొడ్డిదారిలో చేరి.. 34 ఏండ్లుగా తిష్ట
హోమ్‌లో ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా ఉన్న లక్ష్మీపార్వతి 1990లో దినసరి కూలీగా చేరారని పూర్వవిద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆ తరువాత నిర్దేశిత అర్హతలు లేకుండానే ఆమె స్టోర్ కీపర్‌గా మారి అనాథ పిల్లల కడుపులు కొట్టి కోట్లకు పడగలెత్తారని పేర్కొన్నారు. ఆపై ఫేక్ సర్టిఫికెట్లను పెట్టి హాస్టల్ వార్డెన్‌గా, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్లు కూడా పొందారని అంటున్నారు. ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా మారారని, వాస్తవానికి ఆమె ఆర్థికశాఖ ఆమోదం లేకుండానే ప్రమోషన్లు పొందారని విమర్శిస్తున్నారు.
ప్రభుత్వ అనుమతి లేకుండానే ఆమె ఇప్పటికి 75 దేశాలలో పర్యటించి వచ్చారని ఆరోపించారు. విక్టోరియా మెమోరియల్ హోమ్‌ను గ్రేడ్ 2-బీ వారసత్వ సంపదగా గుర్తించారు. ఈ హోమ్‌లో బంగారు, వెండి, రాగి, ఇత్తడి, పింగాణి, తదితర విలువైన వస్తువులు లాకర్స్ ఉన్నాయి. వాటిలో చాలావరకు సంపదను బయటకు తరలించారని ఆరోపిస్తున్నారు.
నిజాం కాలం నాటి బర్మా టేకు కలపను కూడా వదలడం లేదని, పాత భవనాల్లోని టేక్ ఉడ్‌ను సొంత ఇంటికోసం వాడుకున్నారని ఆరోపిస్తున్నారు. హోమ్‌కు వస్తున్న నిధులను సైతం ఆమె పక్కదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సినిమా షూటింగ్‌ల కోసం ఒక్క రోజుకు రూ.3,14,115 వసూలు చేస్తారని, కానీ వాటికి లెక్కలే ఉండవని అన్నారు. సూపరింటెండెంట్ ఈ నిధులతో దేశంలోని పలు నగరాల్లో అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు.